నగరంలో మొత్తం 2,09,761 మంది బోగస్ ఓటర్లున్నట్టు ఎన్నికల కమిషన్ గుర్తించింది.
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో మొత్తం 2,09,761 మంది బోగస్ ఓటర్లున్నట్టు ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీరిలో 1,20,605 మంది డూప్లికేట్ ఓటరు గుర్తింపు కార్డులను, 89,156మంది పలు ఓటరు గుర్తింపు కార్డులను కలిగిఉన్నారని ఢిల్లీ ఎన్నికల కార్యాలయం నిర్ధారించింది. ఓటరు జాబితా పునఃపరిశీలనలో ఈ విషయం వెల్లడి కావడంతో పలు ఓటరు ఐడీ కార్డులు, డూప్లికేట్ ఓటరు కార్డులకు సంబంధించి ఓటరు జాబితాలో ఉన్న పొరపాట్లను సవరించారు. ఐటీ ఆధారిత అప్లికేషన్లు, క్షేత్ర స్థాయిలో ధ్రువీకరణ సహాయంతో బోగస్ ఓటర్ల గుట్టు రట్టు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
క్షేత్ర స్థాయి ధ్రువీకరణ సమయంలో అనుమానాస్పద ఓటరు గుర్తింపు కార్డులున్నట్లు తేలినవారికి నోటీసులు ఇచ్చి, వారి పేర్లను జాబితానుంచి తొలగించవచ్చంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు బూత్‌స్థాయి అధికారుల క్షేత్ర స్థాయిలో ఓటరు కార్డుల ధ్రువీకరణ జరిపి, డూప్లికేట్, మల్టిపుల్ కార్డులు ఉన్నవారిని గుర్తించి, వారికి నోటీసులు జారీ చేసిన అనంతరం వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. జిల్లా ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని ఆయా రాజకీయ పార్టీలకు కూడా తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఢిల్లీ ఎన్నికల కార్యాలయం 12 లక్షల మంది బోగస్ ఓటర్లను జాబితానుంచి తొలగించింది.