సాక్షి, న్యూస్‌లైన్: అత్యధిక మంది నివాసముండే మురికివాడ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ముంబై అగ్నిమాపక శాఖ ‘మిని ఫైర్ ఇంజను’ల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. ఇవి అందుబాటులోకి వస్తే మురికివాడల్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఇరుకైన వీధుల మీదుగా త్వరగా ఘటనాస్థలికి వెళ్లే అవకాశముంటుంది. దీంతో ఘటన తీవ్రతతో పాటు ఆస్తి, ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించే వీలుంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
ఆయా ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలో తదితర అంశాలపై స్థానికులకి కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ‘మురికివాడల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. దీంతో ఒక్క ఇంటిలో ప్రమాదం సంభవిస్తే ఏక కాలంలోనే 10 ఇళ్లకు మంటలు వ్యాపిస్తాయి. దీంతో ఇక్కడివారు కొన్ని రోజుల పాటు నీటితో మంటలను ఆర్పుతుంటారు. ఈ అగ్ని ప్రమాదాన్ని ఓ పద్ధతి ద్వారా ఎదుర్కొవడానికి వీరికి శిక్షణ ఇస్తున్నామ’ని ఆయన చెప్పారు. దీనివల్ల వారు చాకచాక్యంగా వ్యవహరించి ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. ఆ లోపు అగ్నిమాపకశాఖ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతుందని, ఫలితంగా ఆస్తి, ప్రాణ నష్టం తగ్గుతుందని గోవండీకి చెందిన స్వతంత్ర కార్పొరేటర్ మొహమ్మద్ సిరాజ్ ఇక్బాల్ తెలిపారు. ఇదిలావుండగా 2013-14 కార్పొరేషన్ బడ్జెట్‌లోనే మురికివాడల కోసం ఫైర్ ప్రివెన్షన్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్‌ల ప్రణాళికను సూచించారు. మున్సిపల్ కమిషనర్ సీతారామ్ కుంటే ఫిబ్రవరిలో దీనిని ప్రకటించారు.
అయితే ఈ ప్రణాళిక ఇంకా ప్రారంభ దశలోనే ఉందని అగ్నిమాపక అధికారి సుహాస్ జోషి తెలిపారు. అయితే మురికివాడల్లోని ఇళ్లలో అంతర్గత అగ్నిమాపక వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కూడా చేశామని, అయితే అది విజయవంతం కాలేదని వివరించారు. దీంతో రెండు మినీ ఫైర్ ఇంజన్లను కొనుగోలు చేయడానికి యోచిస్తున్నామన్నారు. మురికివాడల్లోని కొన్ని ఫైర్ స్టేషన్లలో అవగాహన సదస్సులను ప్రారంభించామని డిప్యూటీ చీఫ్ ఫైర్ అధికారి పీ.ఎస్.రంగ్‌దలే తెలిపారు. అయితే మురికివాడల్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎదుర్కొవడానికి ఫైర్ బ్రిగేడ్.. తొమ్మిది సభ్యులతో కూడిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటుచేయనుందని ఆయన వివరించారు.
తెరపైకి మినీ ఫైర్ ఇంజన్లు
Published Tue, Sep 24 2013 1:09 AM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM
Advertisement