సకాల దరఖాస్తులను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర హెచ్చరించారు.
సాక్షి, బెంగళూరు : సకాల దరఖాస్తులను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర హెచ్చరించారు. ‘సకాల’ పనితీరుకు సంబంధించిననివేదికను విధానసౌధాలో మీడియాకు సోమవారం వివరించారు. నిర్ధిష్ట గడువులోగా దరఖాస్తులు పరిష్కరించడంలో ఏడుసార్లు విఫలమైన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ మేరకు రూపొందించిన నిబంధనలకు గవర్నర్ కార్యాలయం అనుమతిచ్చిందన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువరిస్తామని అన్నారు. రాష్ట్రంలో సకాల ప్రారంభించి రెండేళ్లు పూర్తయిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 669 సేవలు సకలా ద్వారా ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 5.78 కోట్ల దరఖాస్తులు సకాల కింద ప్రభుత్వానికి రాగా అందులో 7.70 కోట్ల దరఖాస్తులను పరిష్కరించినట్లు వివరించారు.
524 దరఖాస్తులకు సంబంధించి నిర్ధిష్ట వ్యవధిలోగా పనులు పూర్తిచేయకపోవడం వల్ల సంబంధిత దరఖాస్తుదారునికి రూ.67,440 పరిహారంగా అందించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కామన్వెల్త్ అసోషియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రశస్తి పోటీల్లో సకాల తుది దశలో ఉందన్నారు.
త్వరలో మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగే ఫైనల్ పోటీల్లో తప్పక ‘సకాల’కు ప్రశస్తి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు చట్టప్రకారం సహకరిస్తానని గవర్నర్ వజుభాయ్‌రుడాభాయ్ వాలా భరోసా ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య సఖ్యత లేదని కొన్ని మీడియాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.