దక్షిణ కన్నడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నదుల అనుసంధానానికి సంబంధించిన పధకాల అమలుపై
మంత్రులను నిలదీసిన విపక్షాలు
పరిషత్‌లో మాటల యుద్ధం
బెంగళూరు : దక్షిణ కన్నడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నదుల అనుసంధానానికి సంబంధించిన పధకాల అమలుపై విధానపరిషత్‌లో జరిగిన చర్చ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. విధానపరిషత్ కార్యకలాపాల్లో భాగంగా బుధవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు గణేష్ కార్నిక్ నదుల అనుసంధానికి సంబంధించిన పురోగతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి సమాధానం ఇస్తున్నారు. అదే సమయంలో మంత్రులు అభయ్ చంద్రజైన్, రామనాథ్ రై సైతం సమాధానం ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
దీంతో మంత్రుల తీరుపై విధానపరిషత్‌లో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సభ్యులు అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి సమాధానం చెబుతున్నారు. అయినా కూడా ఇతర శాఖలకు చెందిన మంత్రులు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు.
తన శాఖకు సంబంధించిన వివరాలు చెప్పే సమర్థత మంత్రులకు లేదా?’ అంటూ ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ సభ్యుడు హెచ్.ఎం.రేవణ్ణ కలగజేసుకొని ‘మీరు మంత్రుల సమర్థత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయా మంత్రులు వారి వారి శాఖలను సమర్ధవంతంగానే నిర్వహిస్తున్నారు’ అని సమాధానమిచ్చారు. అనంతరం మంత్రి రామనాథ రై మాట్లాడుతూ....‘మేము కరావళి ప్రాంతానికి చెందిన మంత్రులం, మా ప్రాంతానికి సంబంధించిన సమస్యను ప్రస్తావించడంతో సమాధానం చెప్పేందుకు మేమూ ముందుకొచ్చాం. అంతేకానీ మా మంత్రివర్గ సభ్యుడికి సమాధానం చెప్పే సమర్థత లేక కాదు’ అంటూ మండిపడ్డారు. దీంతో విధానపరిషత్ సభాధ్యక్షులు శంకరమూర్తి కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.