- బాధిత కుటుంబానికి రూ. లక్ష అందజేత
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుల్బర్గలోని వరద పీడిత ప్రాంతాల్లో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ ఆదివారం పర్యటించారు. గత నెల 26 నుంచి 30 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల అక్కడ అపార నష్టం సంభవించింది. స్థానిక శరణ బసవేశ్వర చెరువులో నీటి పరిమాణాన్ని తగ్గించడానికి చేసిన ఏర్పాట్లను మంత్రి తిలకించారు. చెరువు కట్టలను పటిష్ట పరచడానికి రూ.6.74 కోట్లు వ్యయం కాగల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు మహా నగర పాలికె కమిషనర్ శ్రీకాంత్ కట్టిమని ఆయనకు తెలిపారు.
అనంతరం కమలా నగరలో వరదల్లో మరణించిన ఆరేళ్ల మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించారు. తన సొంత డబ్బు నుంచి రూ.లక్ష నష్ట పరిహారాన్ని అందించారు. ఆయన వెంట ఎమ్మెల్యే దత్తాత్రేయ సీ. పాటిల్, ఎమ్మెల్సీ అమరనాథ పాటిల్, మాజీ మంత్రులు రేవూ నాయక్ బెళమగి, సునీల్ వల్కాపురె, జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ సీఈఓ ప్రభృతులున్నారు.