సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశ ప్రధాని కావాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పగటి కలలు కంటున్నారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. ఇక్కడి కేపీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోడీ కలలన్నీ కల్లలవుతాయని జోస్యం చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగంపై మోడీ విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. అభివృద్ధిలో గుజరాత్ దేశంలోనే తొలి స్థానంలో ఉందంటూ మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం గుజరాత్ 10-12 స్థానంలో ఉందన్నారు. మహారాష్ర్ట, హర్యానా, కేరళ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని వెల్లడించారు. మోడీ అధిక ప్రసంగాలు మాని, గుజరాత్‌ను అభివృద్ధి పరచిన అనంతరం మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ప్రధాని ప్రసంగంపై ముఖ్యమంత్రులు విమర్శలు చేసే ఆనవాయితీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు.
బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే. అద్వానీ సైతం మోడీ వ్యవహార శైలిని తప్పుబట్టారని గుర్తు చేశారు. అదే పార్టీలో ఉన్న మోడీ ఆ మాత్రం పెద్దరికాన్ని ఎందుకు ప్రదర్శించలేక పోయారని ప్రశ్నించారు. కాగా రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలకు, మూడు శాసన మండలి స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయా నియోజక వర్గాల్లో పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తోందన్నారు. రెండు రోజుల పాటు తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని ఆయన తెలిపారు.
మోడీవి పగటి కలలు : ఖర్గే
Published Sat, Aug 17 2013 3:53 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement