
నటించడమే బాగుంది
తరుణ్ తహిల్యాని, రోహిత్ బాల్ వంటి గొప్పగొప్ప డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసినా కెమెరా ముందు నటించడమే బాగుందని చెబుతోంది కృతి సనన్. ‘వన్’ సినిమాతో టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు సరసన నటించి మంచి మార్కులే కొట్టేసిన ఈ సుందరి జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్‌తో కలసి బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. టైగర్‌ష్రాఫ్, కృతి జంటగా ‘హీరోపంతి’ సినిమా ఇటీవలే విడుదలైంది. మోడల్ రంగం నుంచి సినీ పరిశ్రమకు వచ్చిన మీకు ఏది సులభంగా ఉందని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు కృతి సమాధానమిస్తూ... ర్యాంప్ వాక్ చేయడం కంటే కెమెరా ముందే తనకు సౌకర్యంగా అనిపించిందని చెప్పింది.
ర్యాంప్‌పై నడిచేటప్పుడు ఎదుటివారిని అప్పటికప్పుడే సంతృప్తి పర్చాల్సి ఉంటుందని, తప్పులు జరిగితే సరిదిద్దుకునే సమయం అక్కడ ఉండదని, సినిమాలో అయితే ఎన్ని టేక్‌లైనా తీసుకొని సీన్ సరిగ్గా వచ్చేంతవరకు నటించే అవకాశముంటుందని చెప్పింది. ఐదేళ్లప్పుడే ర్యాంప్‌వాక్ చేసిన తాను న్యూఢిల్లీలోని ఆర్‌కే పురంలోగల ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు మోడల్ రంగంవైపు వెళ్తానని అనుకోలేదని, అలాగే మోడల్‌గా కొనసాగుతున్నప్పుడు సినీ పరిశ్రమవైపు వస్తానని అనుకోలేదని చెప్పింది. ర్యాంప్‌వాక్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి చాలా ఇబ్బందిగా అనిపించేదని, నటించే సమయంలో మాత్రం అలాంటి అనుభవం ఒక్కసారి కూడా ఎదురుకాలేదని చెప్పింది.
మోడలింగ్‌ను ఎప్పుడూ కెరీర్‌గా భావించలేదని, సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత మాత్రం నటనను కెరీర్‌గా మలచుకోవాలనే అభిప్రాయం కలుగుతోందని చెప్పింది. మే 23న విడుదలైన ‘హీరోపంతి’ తొలివారంలోనే రూ. 23 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద మంచి బోణీ చేసిందని, తొలి సినిమా విజయవంతం కావడం సంతోషంగా ఉందని చెప్పింది. కొత్తదనాన్ని, కొత్తవారిని ఆదరిస్తున్న బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, అయితే కథలు, పాత్రల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానంది.