
చల్లారని ‘నాడార్ల’ ఆగ్రహం
* కార్తీకి వ్యతిరేకంగా నిరసన
* సత్యమూర్తి భవన్ ముట్టడికి యత్నం
* పలువురి అరెస్ట్
సాక్షి, చెన్నై: దివంగత నేత కామరాజనాడర్‌కు వ్యతిరేకంగా కేంద్ర మాజీ మంత్రి పీ.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలు నాడార్ల సంఘాల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. క్షమాపణ చెప్పకుండా, నిర్లక్ష్య పూరితంగా సమాధానం ఇస్తున్న కార్తీ తీరును ఖండిస్తూ నాడార్ల సంఘాలు శుక్రవారం సత్యమూర్తి భవన్ ముట్టడికి యత్నించాయి. మార్గమధ్యంలో నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశా రు. గత నెల సత్యమూర్తి భవన్ వేదికగా జరిగిన యువజన సమావేశంలో చిదంబరం తనయుడు కార్తీ నోరు జా రిన విషయం తెలిసిందే.
కామరాజర్ సుపరిపాలనను మళ్లీ తీసుకొస్తాం.. ఆ పాలనే లక్ష్యం, పూర్వ వైభవం ధ్యేయం అన్న నినాదాల్ని పక్కనపెట్టి, భవిష్యత్తు లక్ష్యం గా ఏం చేద్దాం అన్న అంశాలపై దృష్టి పెట్టాలని కార్తీ చేసి న వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తమిళనాడులో కామరాజర్ లేనిదే కాంగ్రెస్ లేదన్నది జగమెరిగిన సత్యం. అలాంటి నేతను అగౌరవపరిచే విధంగా కార్తీ చిదంబరం అనుచిత వ్యాఖ్యలు చేయడం రచ్చకెక్కింది. కాంగ్రెస్ వాదులు పలువురు ఖండించారు. నాడార్ల సంఘాలు కార్తీ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించాయి. క్షమాపణకు పట్టుబడుతూ ఆయన ఇంటి ముట్టడికి యత్నించాయి. కార్తీకి వ్యతిరేకంగా ఆందోళనల్ని ఉధృతం చేయడానికి నిర్ణయించాయి. తాజాగా కార్తీపై ఎలాంటి చర్యలు తీసుకోని కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ సత్యమూర్తి భవన్ ముట్టడికి యత్నించారు.
ముట్టడి: కార్తీ క్షమాపణ చెప్పాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాడార్ల సంఘాలు ఉదయం సత్యమూర్తి భవన్‌ముట్టడికి బయలు దేరాయి. గతంలో ఓ మారు ఓ సంఘం నేతృత్వంలో సత్యమూర్తి భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. తమ కార్యాలయాన్నే ముట్టడిస్తారా? అంటూ కాంగ్రెస్ వాదులు తిరగబడడంతో ఆ పరిసరాలు రణరంగంగా మారాయి. తాజాగా నాడార్ల సంఘాలు ముట్టడికి యత్నిం చడంతో ఎక్కడ ఉద్రిక్తతకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
క్షత్రియ నాడార్ల సంఘం నేత చంద్రన్ జయపాల్, నాడార్ల సంఘం నేత పద్మనాభన్‌ల నేతృత్వంలో ఆ సంఘాల నాయకులు ర్యాలీగా ఎక్స్‌ప్రెస్ అవెన్యూ వద్దకు చేరుకున్నారు. వారిని సత్యమూర్తి భవన్ వైపుగా వెళ్లనీయకుండా పోలీసు లు అడ్డుకున్నారు. కాసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. కార్తీ క్షమాపణ చెప్పాల్సిందేనని, ఆయన పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని నిరసన కారులు నినదించారు. చివరకు ట్రాఫిక్‌కు ఆటంకం నెలకొనడంతో ఆందోళనకారుల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.