నయనే కావాలి
చిత్రాల్లో ఎలాంటి సన్నివేశాలున్నా అవి నయనానందకరంగా ఉంటేనే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చి చూస్తారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఒక పక్క పాత్రల్ని పండిస్తూ మరో పక్క అందంతో యువతను ఉల్లాసపరిచే నటీమణుల్లో నయనతార ఒకరు. ఈమెది మహర్ధశ అని చెప్పక తప్పదు. కోలీవుడ్ కాకపోతే టాలీవుడ్ అది లేదంటే ఉండనే ఉంది మాతృభాష అయినా మాలీవుడ్. ఈ బ్యూటీ సొంత గడ్డపై నటించిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అది ఎంత మంచి చిత్రంగా పేరు పొందిందంటే సూపర్‌స్టార్ రజినీకాంత్‌నే తమిళ రీమేక్‌లో నటించాలన్న ఆసక్తిని రేకెత్తించినంతగా.
అయితే కొన్ని కారణాల వలన ఆ చిత్ర రీమేక్‌లో రజనీకాంత్ నటించడం లేదన్నది వేరే సంగతి. వ్యక్తిగత కారణాల వలన నటనకు దూరం అయిన సుమారు రెండేళ్ల తరువాత మళ్లీ రీ ఎంట్రీ అయి రాజారాణి చిత్రంతో మరోసారి హీరోయిన్‌గా విజయాన్ని అందుకున్నారు. దీంతో తమిళంలో అవకాశాలు ఆమెపై దండెత్తాయనే చెప్పాలి. ఇటీవల విడుదలైన మాస్ చిత్రం వరకు నయనతార విజయపరంపర కొనసాగుతునే ఉంది. ప్రస్తుతం నయన నటించిన ఇదు నమ్మ ఆళు, తనీ ఒరువన్, మాయ, నానుం రౌడీదాన్ చిత్రాలు విడుదలకు వరుసకడుతున్నాయి. తాజాగా కార్తీతో కాష్మోరా చిత్రంలో నటిస్తున్న ఈ క్రేజీ హీరోయిన్ కోలీవుడ్ నంబర్‌వన్ స్థానంలో వెలుగొందుతున్నారు.
రెండు, రెండున్నర కోట్లు పారితోషికం డిమాండ్ చేసినా దర్శక, నిర్మాతలు నయనతారనే హీరోయిన్‌గా కోరుకోవడానికి మరో కారణం కూడా లేకపోలేదు. ఈ అమ్మడికి టాలీవుడ్‌లోనూ యమ క్రేజ్ ఉంది. ఆ మధ్య అనామిక చిత్ర ప్రమోషన్ విషయంలో కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నా ఇప్పుడు అవన్నీ సమసి పోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ తమ సరసన ఈ బ్యూటీనే హీరోయిన్‌గా కోరుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, జూనియర్ ఎన్‌టీఆర్‌లతో నటించడానికి రెడీ అవుతున్న నయనతార నటుడు చిరంజీవి 150వ చిత్రంలో కూడా హీరోయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ అమ్మడికింత డిమాండ్‌కు కారణం ఏమిటన్నది ఆరా తీస్తే ముఖ్యంగా వసూళ్లే కనిపిస్తున్నాయి. నయనతార నటించిన తమిళ చిత్రాలు, తెలుగులోనూ అనువాదం అయినా గల్లాపెట్టెలు నింపుతున్నాయి. తెలుగులో నటించిన చిత్రాల అనువాదానికి కోలీవుడ్‌లో వ్యాపారం జరుగుతోంది. దీంతో ఈ కేరళ కుట్టి హవా కొనసాగుతోంది.