
ఇళయ దళపతితో నయన మూడోసారి..
దక్షిణాది చిత్రపరిశ్రమలో నటి నయనతార రూటే వేరు అని చెప్పవచ్చు. ఆమె వ్యక్తిగత జీవితం ఎత్తుపల్లాలైనా, సినీ పయనం
దక్షిణాది చిత్రపరిశ్రమలో నటి నయనతార రూటే వేరు అని చెప్పవచ్చు. ఆమె వ్యక్తిగత జీవితం ఎత్తుపల్లాలైనా, సినీ పయనం మాత్రం ఎగసి పడే కెరటమే నని చెప్పక తప్పదు. ఒకటి రెండు ప్లాప్‌లు ఎదురయితే అయ్యో పాపం అనుకునే లోపే విజయాలు ఈ సంచలన నటిని వరించేస్తున్నాయి. తాజాగా లేడీ సూపర్ పట్టం కూడా దక్కించుకున్న నయనతార ఇటీవల విడుదలైన తనీఒరువన్, మాయ చిత్రాల విజయాలు ఆమె క్రేజ్‌ను మరింత పెంచాయి.ఈ ముద్దగుమ్మ ప్రత్యేకత ఏమిటంటే చిన్న హీరో, పెద్ద హీరో అన్న తారతమ్యం చూపకుండా తన పాత్ర నచ్చితే చేయడానికి సిద్ధమయిపోతున్నారు.
అలా మాయ చిత్రంలో ఆరి అనే వర్ధమాన నటుడితో నటించి సక్సెస్ అయ్యారు. ఇక విజయసేతుపతితో కలిసి నటించిన నానుమ్ రౌడీ దాన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక అసలు విషయం ఏమిటంటే త్వరలో ఇళయదళపతితో రొమాన్స్‌కు రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ బ్యూటీ విజయ్‌తో తొలిసారిగా శివకాశి చిత్రంలో సింగిల్ సాంగ్‌కు స్టెప్స్ వేశారు. ఆ తరువాత విల్లు చిత్రంలో నాయికగా నటించారు.
ఆ తరువాత ఈ జంట కలిసి నటించిన చిత్రం రాలేదు. కాగా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న విజయ్ తదుపరి ఏఎం.రత్నం నిర్మించనున్న చిత్రంలో నటించనున్నట్లు కోలీవుడ్ టాక్. ఇందులో విజయ్ సరసన నయనతార సటించనున్నట్లు సమాచారం.దీనికి ఎస్‌జే.సూర్య దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. కాగా ఏఎం.రత్నం, విజయ్, ఎస్‌జే.సూర్య కలయికలో ఇంతకుముందు ఖుషి వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిందన్నది గమనార్హం.