ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్‌డీఎంసీ కాల్ సెంటర్
Published Sat, Nov 9 2013 11:09 PM | Last Updated on Tue, Aug 14 2018 3:18 PM
న్యూఢిల్లీ: ప్రజా సమస్యల పరిష్కారానికి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎంసీ) త్వరలో ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. నాలుగంకెలుగల ఈ కాల్‌సెంటర్ నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరిస్తామని ఎన్‌డీఎంసీ చైర్మన్ జల్‌రాజ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇందుకు అవసరమైన అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని, వాటిని సంబంధిత అధికారుల వద్దకు పరిష్కారం కోసం పంపుతారన్నారు. ఏదైనా సమస్యకు సంబంధించి రెండురోజుల్లో ఎటువంటి కదలిక లేనిపక్షంలో సదరు ఫిర్యాదు దానంతటదే ఉన్నతాధికారుల వద్దకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు కూడా చేశామన్నారు.
అప్పటికీ పరిష్కారం కాకపోతే నాలుగురోజుల తర్వాత సదరు ఫిర్యాదు ఎన్‌డీఎంసీ చైర్మన్ వద్దకు వెళ్తుందని శ్రీవాస్తవ తెలిపారు. ఈ నాలుగంకెల నంబర్ కోసం నమోదు ప్రక్రియ పూర్తయిందని, లాంఛనంగా ప్రారంభించాల్సింది మాత్రమే మిగిలిందన్నారు. మరో రెండు వారాల్లో ఈ కాల్‌సెంటర్‌ను ప్రారంభించే అవకాశముందని చెప్పారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ‘ఫేస్ టు ఫేస్’ పేరిట శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ సభ్యులతోపాటు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ పీకే గుప్తా, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ మనీశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నగరంలో చెత్త నిర్మూలన, మురుగునీటి పారుదల, మురుగునీటి కాల్వల పరిస్థితి, రహదారుల దుస్థితి తదితర విషయాలపై చర్చించారు.
Advertisement
Advertisement