పైరసీని అరికట్టడానికి కొత్త టెక్నిక్
పైరసీకి చెక్ పెట్టే విధంగా పులన్‌విచారణై -2 చిత్ర యూనిట్ కొత్తగా సాంకేతికపరమైన టెక్నిక్‌ను కనిపెట్టింది. విజయకాంత్ హీరోగా నటించిన పులన్‌విచారణై చిత్రం ఎంతో ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు ఆర్ కె సెల్వమణి, ప్రశాంత్ హీరోగా పులన్ విచారణై -2, తెరకెక్కించారు. రావేదర్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఇబ్రహీం రావుత్తర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పైరసీకి గురి కాకుండా సాంకేతిక పరమైన కొత్త టెక్నిక్‌ను కనుగొన్నట్లు చిత్ర దర్శకుడు ఆర్‌కె సెల్వమణి పేర్కొన్నారు. పులన్‌విచారణై -2 చిత్రాన్ని తాను తమిళనాడు, పాండిచ్చేరిలలో మాత్రమే ముందుగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర సీడీ, డీవీడీ, శాటిలైట్, వెబ్‌సైట్, ఇంటర్‌నెట్, కేబుల్‌టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ హక్కులను ఎవరికీ విక్రయించలేదని తెలిపారు. చిత్రం ఎస్‌ఎంఎస్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి, పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు.
మొదట విజయం : పులన్ విచారణ -2 చిత్ర యూనిట్ పైరసీని అరికట్టడలో తొలి విజయం సాధించారన్నారు. తమ ఫిర్యాదు మేరకు పోలీసు కమిషనర్ ఆమ్నీ బస్ నిర్వాహకులందరినీ పిలిపించి కొత్త చిత్రాలను ప్రదర్శించకుండా హెచ్చరించారని తెలిపారు. పైరసీకి పాల్పడితే కనుగొనడానికి తాముకొత్త టెక్నిక్‌ను కనిపెట్టినట్లు చెప్పారు. తమ చిత్ర పైరసీ సీడీలకు పాల్పడినట్లయితే ఏ థియేటర్‌ల్లో పైరసీకి పాల్పడుతున్నారన్నది ఆ ప్రాంత సెల్‌ఫోన్ టవర్స్ కోడ్ నెంబర్ నమోదవుతోందన్నారు. అదే విధంగా ఎక్కడ డీవీడీలను తయారు చేస్తున్నారు ఆ తరువాత దానికి ఎక్కడ కాపీ రూపొందిస్తున్నారన్న అంశాలు కూడా రిజిస్టర్ అవుతాయని తెలిపారు. ఇలాంటి కొత్త టెక్నిక్‌తో విడుదలవుతున్న తొలి చిత్రం పులన్ విచారణై -2 అని ఆర్‌కె సెల్వమణి పేర్కొన్నారు. నిర్మాత ఇబ్రహీం రావుత్తర్ నియాఖత్ అనీఖాన్, షణ్ముగధరన్ పాల్గొన్నారు.