ఆప్‌కు అర్హత లేదు
సాక్షి, ముంబై: కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంద్వారా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కును ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నైతికంగా కోల్పోయిందని శివసేన నాయకుడు ఉద్ధవ్‌ఠాక్రే ఆరోపించారు. ‘ఢిల్లీ శాసనసభలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో గెలుపుకోసం అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ పార్టీ మద్దతును ఆప్ తీసుకుంది. చీపురుతో అవినీతిని ఊడేస్తామని ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వంచకుడు’ అని పార్టీ అధికార పత్రిక దో పహర్‌కీ సామ్నాలో సోమవారం రాసిన సంపాదకీయంలో ఉద్ధవ్ పేర్కొన్నారు. ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నేత హర్షవర్ధన్ నిజాయితీపరుడంటూ కేజ్రీవాల్ సర్టిఫికెట్ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా కేజ్రీవాల్ నిజాయితీని హర్షవర్ధన్ బయటపెట్టారన్నారు. ఢిల్లీ ప్రజలను అరవింద్ బృందం ఎలా వంచించిందనే విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించారన్నారు. ప్రజల మనోభావాలతో ఆప్ ఆడుకుంటోందన్నారు.
ఆందోళన చెందాల్సిన పనే లేదు
మహారాష్ట్రలో ఆప్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇక్కడి ప్రజలు ఆమ్ ఆద్మీలే (సామాన్య పౌరులే)నని, అందువల్ల వారంతా తమ పార్టీకి అండగా నిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.