- మంగళవారం ఒక్క రోజే ఏడు వేల దరఖాస్తులు
- అక్షయ తృతీయ కావడంతోనే..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (ఎంహెచ్‌ఏడీఏ) నిర్మించిన ఇళ్ల కోసం భారీ సంఖ్యలో అక్షయ తృతీయ రోజున ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సమారు 7,100 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 31,580కు చేరింది.
ఈ విషయాన్ని ఎంహెచ్‌ఏడీఏ ముంబై రీజియన్ అధికారి చంద్రకాంత్ డాంగే వెల్లడించారు. మంచి ముహూర్తం కావడంతో అందులో 722 మంది ఇళ్ల కోసం బ్యాంకులో డీడీలు కూడా తీశారు. మధ్య తరగతితోపాటు అల్ప, అత్యల్ప వర్గాలందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో ముంబై దగ్గరలోని సైన్, గోరేగావ్, ములుండ్, మాన్‌ఖుర్ద్ తదితర ప్రాంతాల్లో ఎంహెచ్‌ఏడీఏ ఈ ఏడాది 997 ఇళ్లు నిర్మించి సిద్ధంగా ఉంచింది. ఇందులో అర్హులైన వారి ఆదాయాన్ని బట్టి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఇందుకు సంబంధించి మే 31న బాంద్రాలోని రంగశారద సభా గృహంలో లాటరీ వేయనున్నారు. అందులో ఇళ్లు దక్కిన వారు డీడీ డబ్బులు పోగా మిగతా సొమ్ము చెల్లించాలి. ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజే 6,756 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంఖ్య ఇంకా పెరగవచ్చని ఎంహెచ్‌ఏడీఏ అధికారులు భావించినా.. అది సగానికి తగ్గిపోయింది. అక్షయ తృతీయ ముహూర్తం సందర్భంగా ఏడు వేలకుపైగా దరఖాస్తులు చేసుకోవడంతో అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. గడువు మే 18న సాయంత్రం ఆరు గంటల ముగియనుంది.
31.5 వేలకు చేరిన ఎంహెచ్‌ఏడీఏ ఇళ్ల దరఖాస్తులు
Published Wed, Apr 22 2015 10:52 PM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement
Advertisement