స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు
భువనేశ్వర్ : జగన్నాథునిపట్ల జరుగుతున్న తప్పిదాల శీర్షికతో రాష్ట్ర శాసన సభ భగ్గుమంది. మంగళవారం ఈ విచిత్ర పరిస్థితి చోటు చేసుకుంది. రాష్ట్ర శాసన సభలో మలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం యథాతథంగా ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాల్ని ప్రారంభించేందుకు స్పీకర్ ఆదేశించిన మరుక్షణమే సభలో వాతావరణం వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు భారతీయ జనతా పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకుపోయారు. ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని దేవస్థానంలో దైనందిన సేవాదుల్లో అవాంఛనీయ జాప్యం జరుగుతోంది.
ఈ విచారకర పరిస్థితులు రాష్ట్రంతో పాటు ప్రప ంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న జగన్నాథ స్వామి భక్తుల హృదయాల్ని కలిచి వేస్తున్నాయని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. సభ్యులు శాంతించి సభా కార్యక్రమాలకు సహకరించాలన్న స్పీకర్ అభ్యర్థనపట్ల స్పంద న కొరవడింది. ఈ పరిస్థితుల్లో సభా కార్యక్రమాల్ని ఉదయం 11.30 గంటల వరకు వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రదీప్ కుమార్ ఆమత్ ప్రకటించారు. దీంతో మంగళవారం నిర్వహించాల్సిన ప్రశ్నోత్తరాలకు గండి పడింది.
జీరో అవర్‌లోనూ అదేపరిస్థితి
ప్రశ్నోత్తరాల తర్వాత నిర్వహించాల్సిన జీరో అవర్ సమావేశాలకు సభలో అనుకూల వాతావరణం కనిపించలేదు. శ్రీ మందిరంలో సేవల్లో జాప్యం పట్ల స్పీకర్ రూలింగ్ జారీ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దానికి స్పీకర్ నిరాకరించడంతో ప్రతిపక్షాల గోలతో సభా ప్రాంగణం మార్మోగింది. సభ్యుల్ని అదుపులోకి తెచ్చే పరిస్థితి లేనందున సభా కార్యక్రమాల్ని మరోసారి వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈసారి మధ్యాహ్నం 12.50 గంటల వరకు వాయిదా వేశారు.
అప్పటికీ అదే పరిస్థితి కొనసాగడంతో తిరిగి మధ్యాహ్నం 3 గంటల వరకు సభా కార్యక్రమాల్ని నిరవధికంగా వాయిదా వేశారు. అత్యంత సున్నితమైన అంశంపట్ల ప్రభుత్వ వైఖరి సంతృప్తికరంగా లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేనట్లు ప్రతిపక్షాలు తెగేసి చెప్పడంతో సభా కార్యక్రమాల్ని ముందుకు నడపడం అసాధ్యంగా భావించిన స్పీకర్ అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment