బుగ్గ తీశారు!
► స్వయంగా తొలగించిన సీఎం ఎడపాడి పళనిస్వామి
► అదే బాటలో మంత్రులు
► అందరికీ ఆదేశాలు
► సచివాలయంలో పళని బిజీ
► నీట్ మినహాయింపునకు లేఖ
బుగ్గల సంస్కృతికి స్వస్తి పలుకుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తన వాహనంపై ఉన్న సైరన్‌ను స్వయంగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి తొలగించారు. మంత్రులు అదే బాటలో ముందుకు సాగారు. అధికారులందరి వాహనాల్లో త్వరితగతిన తొలగించాలన్న ఆదేశాలను సీఎం జారీ చేశారు. ఇక, సీఎంగా పగ్గాలు చేపట్టి గురువారంతో రెండు నెలలు కావడంతో సచివాలయంలో పళనిస్వామి బిజీ అయ్యారు.
సాక్షి, చెన్నై: ప్రజాస్వామ్య దేశంలో ఇక వీఐపీ, వీవీఐపీ అన్న సంస్కృతికి చోటు లేదన్నట్టుగా కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీఐపీ సంస్కృతిని సూచించే రీతిలో వాహనాల్లో ఉండే ఎర్ర బుగ్గలు(సైరన్) మే ఒకటి నుంచి ఉండబోవని కేంద్రం చేసిన ప్రకటనతో తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి తక్షణం స్పందించారు. గురువారం ఉదయం సచివాలయంలోకి రాగానే, తన వాహనంపై ఉన్న బుగ్గను సీఎం తొలగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తాను స్పందించానని పేర్కొన్నారు.
తన మంత్రులు వారి వారి వాహనాలపై బుగ్గలను తొలగించేందుకు నిర్ణయించారని, కొందరు తొలగించేశారని, మిగిలిన వారు త్వరితగతిన తొలగిస్తారని వివరించారు. అధికారులు అందరూ త్వరితగతిన తమ తమ వాహనాలపై బుగ్గలను తొలగించాలన్న ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నా, తమఅమ్మ, దివంగత సీఎం జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఎర్రబుగ్గ సైరన్ వాహనాన్ని ఉపయోగించ లేదన్న విషయాన్ని గుర్తెరగాల్సిన అవసరం ఉందని ఈసందర్భంగా వ్యాఖ్యానించారు.
సీఎం బిజీ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి గురువారంతో పళనిస్వామికి రెండు నెలలు అయింది. అందుకే కాబోలు సచివాలయంలో బిజిబిజీ అయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు తదుపరి సచివాలయం వైపుగా సీఎం పెద్దగా దృష్టి పెట్టలేదు. అడపాదడపా కార్యక్రమాలకు హాజరైనా, తాజాగా మాత్రం రోజంతా బిజీగానే ఉండడం గమనార్హం. బల నిరూపణలో నెగ్గిన అనంతరం ఫిబ్రవరి 20వ తేదీన పళనిస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు. తొలి సంతకంగా 500 టాస్మాక్‌ల మూత, అమ్మ పథకాల అమలు మీద దృష్టి పెట్టారు. ఈ రెండు నెలల కాలంలో మొత్తంగా ఆయన 1,520 ఫైల్స్ మీద సంతకాలు పెట్టినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇందులో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నట్టు, ఆరు వందల వరకు గతంలో ఉన్న పెండింగ్ ఫైల్స్ కూడా ఉండడం గమనార్హం. ఈ రెండు నెలల కాలంలో ప్రభుత్వ వ్యవహారాల మీద తొలి వారం పది రోజుల్లో తీవ్ర దృష్టి పెట్టినా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల నగారాతో ఆయన పనితీరు కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అందుకే పాలనా పరంగా ప్రభుత్వం విఫలమైందంటూ ప్రధాన ప్రతి పక్షం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
సీఎం సాయం : మంత్రులు, అధికారులతో వారి వారి శాఖల్లోని కేటాయింపులు, పనుల గురించి సీఎం సుదీర్ఘంగానే చర్చల్లో మునిగారు. తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు జరిగిన కేటాయింపులు, సాగుతున్న పనుల్ని సమీక్షించారు. అలాగే, వివిధ కారణాలు, ప్రమాదాల్లో మరణించిన విధి నిర్వహణలో ఉన్న పోలీసులు 14 మంది కుటుంబాల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారు. తలా రూ. మూడు లక్షలు చొప్పున సాయం ప్రకటించారు. అలాగే, ఆర్మీలో సేవల్ని అందిస్తూ, వాహన ప్రమాదంలో మరణించిన తూత్తుకుడి జిల్లా ములక్కాడుకు చెందిన గుణశేఖరన్ కుమారుడు ముత్తుచందన్ మృతికి తన సంతాపం తెలియజేశారు.
ఆకుటుంబానికి సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వ సాయంగా రూ.20 లక్షలు ప్రకటించి, తక్షణం అందించేందుకు చర్యలు తీసుకోవడం విశేషం. ఇక, నీట్ పరీక్షా సమయం ఆసన్నం అవుతుండడం, తమిళ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆందోళనను పరిగణలోకి తీసుకుని విద్యాశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇక పలువురు వీఐపీల అపాయింట్‌మెంట్‌లతో సీఎం బిజీ అయ్యారు. ఇందులో పారాలింపిక్ విజేత మారియప్పన్ తంగవేల్ సీఎంను కలిసి తనకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ బిరుదును సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కాగా ‘నీతి ఆయోగ్’లో పాల్గొనేందుకు తగ్గ పర్యటన కసరత్తులు సాగాయి. ఆమేరకు శనివారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.