
'చంద్రబాబు అలా అనడం విడ్డూరం'
అనంతలో కరవు పరిస్థితి తెలియదని బాబు అనడం విడ్డూరంగా ఉందని పార్థసారథి అన్నారు.
విజయవాడ: అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితి తనకు తెలియదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి విమర్శించారు. మంగళవారం విజయవాడలో పార్థసారథి మీడియాతో మాట్లాడారు. పుష్కరాల పేరుతో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. సీఎం కోర్డ్యాష్ బోర్డులో ప్రతీది అప్డేట్ అవుతుందని చంద్రబాబు చెప్పారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కృష్ణా డెల్టాలో సాగునీరు లేక ఇప్పటివరకూ 50 శాతం నాట్లు పడలేదని పార్థసారథి అన్నారు. స్విస్ ఛాలెంజ్పై అటార్నీ జనరల్ను పిలిపించడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. స్విస్ ఛాలెంజ్ సరికాదని గతంలో కేంద్రం చెప్పింది, ఇప్పుడు ఏజీ ఎలా వస్తారని? సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై బీజేపీ స్పందించాలని పార్థసారథి డిమాండ్ చేశారు.