చెదిరిన స్వాతి కలలు
- సీటు మారడం వల్లే ప్రమాదం
- పీటలెక్కని ప్రేమ వివాహం
- మృతురాలు స్వాతి దీనగాథ
చెన్నై, సాక్షి ప్రతినిధి : అందరినీ అలరిస్తూ ఆటపాటలతో తడిసిముద్దచేసే ‘స్వాతి’ కలలు చెదిరిపోయూయి. తల్లిదండ్రులతో ముచ్చట్లు, బామ్మతో కబుర్లు, ప్రేమించిన వ్యక్తితో వివాహం...ఇలా ఆమె కన్నకలలను రైలు బాంబు కబళించివేసింది. ఇటీవలే చేరిన ఉద్యోగంలో విరామం తీసుకుని తల్లిదండ్రులను కలుసుకునేందుకు బెంగళూరులో బయలుదేరింది.
తనను అమితంగా ప్రేమించే అవ్వకు బహుమతులు, కుటుంబ సభ్యులకు తినుబండారాలను సిద్ధం చేసుకుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లోనే ఆలస్యం కావడంతో పరుగుపరుగున ఆటోలో రైల్వే స్టేషన్‌కు చేరుకుని బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఆమెకు అప్పుడు తెలియదు తాను మృత్యుకుహరంలోనే కూర్చుంటున్నానని. తనతో పాటు రైలు ఎక్కిన చెన్నైకి చెందిన స్నేహితురాలు రజితతో కలిసి వారికి కేటాయించిన సీటు నెంబరు 9,10లో కూర్చున్నారు. అయితే ఒక కుటుంబం వచ్చి ‘ప్లీజ్ 23, 24 సీట్లలో కూర్చుంటారా’ అని అడిగింది.
స్నేహశీలైన స్వాతి సంతోషంగా అంగీకరించింది. మంచి ఉద్యోగం, ఇంటివారికి బహుమతులు వారిని కలవబోతున్నామనే ఆనందం, తాను ప్రేమించిన వ్యక్తితో జరగనున్న వివాహం ఆమెను నిద్రపోనివ్వలేదు. అలాగే గుంటూరులోని వారింటిలో కూడా ఎపుడు తెల్లారుతుందా, స్వాతి వస్తుందా అని జాగారం చేశారు. సీటు మారడంతో దురదృష్టం ఆమె వెన్నంటే నిలిచింది. వారు కూర్చున్న సీటు కిందనే బాంబును అమర్చి ఉన్నారు.
చెన్నై రాగానే స్నేహితురాలికి టాటా చెప్పి సాగనంపింది. ఆ వెంటనే పెద్ద శబ్దంతో బాంబు పేలడంతో స్వాతి కన్నుమూసింది. పేలుడు జరగడంతో వెంటనే వెనక్కు వచ్చిన స్నేహితురాలి రజిత కన్నీరుమున్నీరైంది. వెళ్లొస్తానని చెప్పింది... ఇలా వెళ్లిపోతుందని అనుకోలేదంటూ విలపించింది. తెల్లారగానే వచ్చిన ఫోన్‌ను అందుకున్న స్వాతి తండ్రి రామకృష్ణన్, తల్లి కామాక్షిదేవి, బామ్మ రాజ్యలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
బీటెక్‌లో 91 శాతం మార్కులతో వర్సిటీ పరిధిలోనే మెరుగైన ర్యాంకును సొంతం చేసుకున్నారు. స్వాతి. చిత్రలేఖనం, కవిత, ఫొటోగ్రఫీలలో దిట్ట. బీటెక్ ఉత్తీర్ణతలో సాధించిన ఉత్సాహంతో ఎంటెక్ పూర్తిచేసి క్యాంపస్ సెలక్షన్ ద్వారా బెంగళూరులో ఉద్యోగం పొందారు. పరిచయం లేని ఊరు వద్దన్నారు పెద్దలు. అందివచ్చిన తొలి ఉద్యోగం వద్దనకూడదంటూ వారికి నచ్చజెప్పి స్వాతి బెంగళూరు వెళ్లిపోయారు. జనవరిలో తొలి జీతంతో బామ్మకు సెల్‌ఫోన్ కొనిచ్చారు. ప్రతిరోజు రాత్రి స్వాతితో మాట్లాడితేగానీ నిద్రపోను, ఇక తనను నిద్రపుచ్చేదెవరని బామ్మ కన్నీరుమున్నీరయ్యూరు.
కాలేజీలోనే ప్రేమ
హైదరాబాద్‌లో చదువుతుండగానే తన సహ విద్యార్థిని ఆమె ప్రేమించారు. అయితే సాధారణ కుటుంబం, బాధ్యతలు ఉండటం వల్ల పెళ్లివాయిదా వేద్దామని చెప్పి అతడిని ఆమె ఒప్పించారు. ఆతను సైతం ఆనందంగా అంగీకరించాడు. ఈ దశలో ప్రేమికునికి ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. వెంటనే స్వాతి తన ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారుసైతం అంగీకరించారు. మరో నెలన్నర రోజుల్లో వారిద్దరి వివాహం జరిపేలా నిశ్చయించారు. చక్కనైన ఉద్యోగం, పెద్దల అనుమతితో ప్రేమించిన వ్యక్తితో వివాహం వంటి రంగుల రంగుల కలలు కంటున్న స్వాతిని రైలు బాంబు కబళించివేసింది, భవిష్యత్తుపై ఆమె కన్న కలల ఆమె దేహం మాదిరే ఛిద్రమైపోయాయి. ఆమెను అభిమానించి, ప్రేమించే వారిని కన్నీటి సంద్రంలోకి నెట్టివేశాయి.