సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై, నంగనల్లూరు 48వ వీధిలో ఒక పోస్టల్ బాక్స్ ఉంది. ఈ పోస్టల్ బాక్స్‌లో ప్రజలువేసే ఉత్తరాలను సేకరించేందుకు ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు తపాలాశాఖ ఉద్యోగి వచ్చేవారు. ఎప్పట్లాగే ఈ నెల 2 న సాయంత్రం ఉత్తరాల సేకరణకై వచ్చిన తపాలాశాఖ ఉద్యోగి రాజా పోస్టల్‌బాక్స్‌లో 23 పాస్‌పోర్టులు పడి ఉండడాన్ని చూసి ఖంగుతిన్నాడు. వాటన్నింటినీ ప్లాస్టిక్ పేపరులో చుట్టచుట్టి పడేశారు. వీటిని తపాలాశాఖ ఉన్నతాధికారులకు అప్పగించాడు.
ఈ నెల 6న మరో 15 పాస్‌పోర్టులు, శుక్రవారం సాయంత్రం 13 పాస్‌పోర్టులు వేసి ఉండటాన్ని గుర్తించాడు. పోస్టల్ అధికారి అమృతలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పళవంతాంగల్ పోలీసులు మొత్తం 51 పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని పరంగిమలై సహాయ పోలీస్ కమిషనర్ కల్యాణ్‌కు అప్పగించగా విచారణ సాగుతోంది. ఆ పాస్‌పోర్టులను తిరువనంతపురం, హైదరాబాద్, తిరుచ్చిరాపల్లి, చెన్నై, విశాఖపట్టణం, ముంబయి, సింగపూరు, మధురై, యూఏ ఈ, కౌలాలంపూర్ తదితర చోట్ల జారీ చేసినట్టు గుర్తించారు.
తొలి దశ విచారణలో 23 పాస్‌పోర్టులు ఎవరికి చెందినవో గుర్తించారు. వాటిలో ఒకటి అమెరికాలో ఉండే ఒక చిన్నారి పాస్‌పోర్టుగా తేలింది. పాస్‌పోర్టులోని చిరునామా ను పట్టుకుని వారి ఇళ్లకు వెళ్లి విచారించగా విమానాశ్రయంలో తాము పోగొట్టుకున్నామని తెలిపారు. దీనిపై పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి బంగారు బిస్కెట్లను అక్రమ రవాణా చేసే వారు పోలీసులకు భయపడి పాస్‌పోర్టులను ఇలా పారవేశారా? అని అనుమానిస్తున్నారు. ఐదేళ్ల క్రితం పోయినవి, ఆరు నెలల క్రితం పోయిన పాస్‌పోర్టులు ఒకేసారి ఎలా పోస్టల్‌బాక్స్‌లో వచ్చి పడ్డాయనే అనుమానం పోలీసు బుర్రలను తొలిచేస్తోంది.
అలాగే మండల పాస్‌పోర్టు అధికారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఉండగా పాస్‌పోర్టుల కేసు విచారణలో సీబీఐ అధికారులు రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఒక పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు మాత్రమే సీబీఐ విచారణ జరుగుతుందని అన్నారు. పోస్టల్ బాక్సులో 51 పాస్‌పోర్టుల లభ్యంపై అందులోని చిరునామా ప్రకారం ముగ్గురిని పిలిపించి విచారించారు. వారు విమానాశ్రయంలో పాస్‌పోర్టులను పోగొట్టుకున్నట్లు చెప్పారు. దీంతో విచారణకు హాజరుకావాల్సిందిగా మిగిలిన 48 మందికి పోలీసులు సమన్లు పంపారు. వీరందరిని విచారణ జరిపిన తరువాతనే ఒక నిర్ధారణకు రాగలమని ఆయన తెలిపారు.
వీడని పాస్‌పోర్ట్ మిస్టరీ!
Published Sat, Jun 11 2016 2:43 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
Advertisement
Advertisement