
శింబుపై పిటిషన్లు ఉపసంహరణ
చె న్నై : నటుడు శింబుపై దాఖలైన కోర్టు కేసులు ఒక్కొక్కటి ఉపసంహరించుకోవడం విశేషం. బీప్ సాంగ్ పాటతో మహిళల్ని అవమానించారంటూ నటుడు శింబు,సంగీత దర్శకుడు అనిరుద్‌లపై పెద్ద దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే.పలు మహిళా సంఘాలు ఆందోళనకు దిగడంతో పాటు కోవై,చెన్నై లలో పలు పోలీసు కేసులు నమోదయ్యాయి.అంతే కాదు శింబు వ్యవహారం కోర్టుల వరకూ వెళ్లింది. ఒక్క సైదాపేట కోర్టులోనే శింబుపై మూడు పిటిషన్‌లు దాఖలయ్యాయి.
ఆయన ముందస్తు బెయిల్ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. దానిపై జనవరి4 న విచారణ జరగనుంది. శింబుపై దాఖలైన పీఎంకే పార్టీకి చెందిన నాయకుడు చెన్నై సైదాపేట కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. మరో రెండు పిటిషన్లను బుధవారం ఉపసంహరించుకోవడం విశేషం. శింబు,అనిరుద్‌లపై విడుదలై చిరుతై పార్టీకి చెందిన దక్షిణ చెన్నై న్యాయవాదుల సంఘం కార్యదర్శి వక్ శీల్ కాశీ చెన్నై,సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌పై బుధవారం 9వ మెట్రో పాలిటిన్ కోర్టు న్యాయమూర్తి దిలీప్ అలెక్ప్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషన్‌దారుడు కాశీ హాజకై పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా కేకే.నగర్‌కు చెందిన విడుదలై చిరుతై పార్టీ కార్యదర్శి పుదియవన్ అలియాస్ లక్ష్మణన్ శింబు, అనిరుద్‌లపై దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సైదాపేట 23వ మెట్రోపాలిటిన్ కోర్టులో న్యాయమూర్తి సురేష్ సమక్షంలో విచారణకు రాగా ఆ కేసును పిటిషనర్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
దీంతో ఇప్పటికి శింబుపై మూడు కోర్టు కేసులు ఉపసంహరించుకోవడం గమనార్హం.శింబు తల్లి వీడియోలో కన్నీటి ఘోష తరువాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.ఇక హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నదే ప్రస్తుతం జరుగుతున్న వాడీవేడి చర్చ.