రాష్ట్రంలో పోలీసులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి...
- మరో ఇద్దరి ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతిభఃభహ
- ముంబైలో ఒకరు, ఔరంగాబాద్‌లో మరొకరు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో పోలీసులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ముంబైలో ఓ పోలీసు ఆత్మహత్య చేసుకోగా, ఔరంగాబాద్‌లో మరో పోలీసు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వాకోలా పోలీస్ స్టేషన్‌లో సీనియర్ పోలీసు అధికారిపై మరో అధికారి కాల్పులు జరిపి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గోవండి పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించే కమలాకర్ ధమనస్కర్ 2006లో పోలీసు శాఖలో చేరాడు. ఆదివారం ఉదయం వాషీ క్రీక్ వద్ద మత్స్యకారులకు ఆయన వృుతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు తెలిపారు.
జేబులోని ఐడీ కార్డు ఆధారంగా కమలాకర్‌గా గుర్తించారు. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయినట్లు తెలిసింది. కుటుంబ సమస్యలా లేక విధి నిర్వాహణలో ఒత్తిడేనా అనే విషయం తెలియరాలేదు. మరో వైపు ఔరంగాబాద్‌లో అనీల్ మాత్రం సీనియర్ పోలీసు అధికారుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. సెలవులు ఇవ్వకపోవడంతో అనీల్ తనపొట్టపై బ్లేడ్‌తో కోసుకున్నాడు. ప్రస్తుతం ఆయనను ప్రభుత్వ ఆసు పత్రిలో చేర్పించారు. ఘటనపై మాట్లాడేందుకు అధికారులు నిరాకరించారు.
పోలీసుల్లో ఆందోళన
వారం రోజుల కిందట వాకోలా పోలీసు స్టేషన్‌లో దిలీప్ శిర్కే సెలవుల విషయంపై గొడవపడి సీనియర్ పోలీసు ఇన్స్‌పెక్టర్ విలాస్ జోషితోపాటు వైర్‌లెస్ ఆపరేటర్ బాలాసాహెబ్ ఆహీర్‌లపై సర్వీసు రివాల్వరుతో కాల్చి అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఘటనతో విలాస్‌తోపాటు దిలీప్ శిర్కే మరణించిన సంగతి తెలిసిందే. తాజా సంఘటనల వల్ల పోలీసు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.