బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ నాయకుడు ప్రకాశ్ అంబేడ్కర్
సాక్షి, ముంబై: వచ్చే శాసన సభ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ స్నేహ హస్తం చాపితే తమకు ఎలాంటి అభ్యతరం లేదని బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ నాయకుడు ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. అయితే పొత్తుకు ముందు కాంగ్రెస్ తమ వైఖరేంటో స్పష్టం చేస్తే అప్పుడు తమ నిర్ణయమేంటో వెల్లడిస్తామని స్పష్టంచేశారు. దాదర్‌లోని అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం సాయంత్రం బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొద్ది సేపు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ, బీజేపీ, శివసేనతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ప్రకాశ్ స్పష్టమైన సంకేతాలిచ్చారు.
వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయి..
భీమా కోరేగావ్ దాడుల ఘటనలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న మిలింద్ ఏక్‌బోటేను ఎన్సీపీ కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. శివసేన స్నేహ హస్తం చూపితే పొత్తుపెట్టుకుంటారా...? అని విలేకరులడిగిన మరో ప్రశ్నకు ప్రకాశ్ సమాధానమిస్తూ శివసేన ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుని ప్రభుత్వంలోంచి బయటపడాలని, ఆ తరువాత పొత్తు విషయంపై మేం ఆలోచిస్తామని అన్నారు. ఏక్‌బోటే బీజేపీతో ఉన్నారని, అతన్ని ఎన్సీపీ రక్షించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ విచారణ పూర్తయ్యేంత వరకు ఏక్‌బోటేను అరెస్టు చేయరని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అంటున్నారని, దీన్నిబట్టి ఏక్‌బోటేను ముఖ్యమంత్రి కూడా వెనుకేసుకొస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. నకిలీ కులధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందని, కానీ, వీరందరిని ఉన్న ఫలంగా ఉద్యోగంలోంచి తొలగిస్తే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ఉద్యోగుల కొరత వల్ల కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగవన్నారు. ఫలితంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని, దీంతో వీరందరికి పదోన్నతులు కల్పించకుండా ప్రస్తుతం కొనసాగుతున్న చోటే విధులు నిర్వహించేలా ఉద్యోగంలో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment