ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు
పెరంబూర్: జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని నటుడు ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రయివేట్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. జల్లికట్టు క్రీడ కోసం యువత చాలా ప్రశాంతంగా, కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్నారన్నారు. తాము వారికి మద్దతు పలికామన్నారు. అలాంటి జల్లికట్టు పోరాటంలో పోలీసుల హింసాత్మక చర్యలు అనవసరంగా పేర్కొన్నారు.
జయలలిత మరణానంతం అందరికీ మాట్లాదే ధైర్యం వచ్చిందని ప్రకాశ్ రాజ్ అన్నారు. జయలలిత మరణం తరువాత బాధ్యతాయుతమైన నాయకుడు లేడని, తమిళ ప్రభుత్వం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, ఇంకా చెప్పాలంటే ప్రస్తుత ప్రభుత్వ పాలనే ప్రశ్నార్థకంగా ఉందని వ్యాఖ్యానించారు. అనూహ్యంగా నాయకుడిని ఎంచుకోరాదన్నారు. వారి కోసం ప్రజలు ఓట్లు వేయలేదని, శాసనసభ్యుల మద్దతు ఉన్నా వారిని ఆ నాయకురాలి కోసమే ప్రజలు ఎన్నుకున్నారన్నది మరచిపోరాదన్నారు.
అయినా రాజ్యాంగ చట్టప్రకారం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం ఐదేళ్లు పారిపాలించాల్సిందేనన్నారు. ఏ ప్రభుత్వం అయినా నిర్మాతల మండలి కోసం వారిని తాము కలిసి మాట్లాడతామని నటుడు ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ఈయన నటుడు విశాల్‌తో కలిసి తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయనున్నారన్నది గమనార్హం.
అదే విధంగా రెండు రోజుల క్రితం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద పోరాటం చేస్తున్న తమిళ రైతులను కలిసి వారికి మద్దతు తెలిపిన ఈ జట్టు బృందం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని, కేంద్ర మంత్రులను కలిసి రైతులు కరువు కోరల్లో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వారి దీన స్థితిని వివరిస్తూ వారి డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.