
కో సీక్వెల్‌కు సిద్ధం
కో చిత్ర కొనసాగింపునకు కథ సిద్ధం అయ్యిందంటున్నారు నిర్మాత ఎల్ రెడ్ కుమార్. జీవా, కార్తీక్ జంటగా నటించిన చిత్రం కో. విశేష ప్రజాదరణ పొందిన ఆ చిత్రాన్ని ఆర్ ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్ రెడ్ కుమార్ నిర్మించారు. గత చిత్రాల పునర్ నిర్మాణాలకు కొనసాగింపు నిర్మాణాలకు ఆసక్తి, ఆదరణ పెరుగుతుండడంతో కో-2కు రెడీ అవుతున్నట్లు నిర్మాత ఎల్ రెడ్ కుమార్ తెలిపారు. ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కో చిత్రానికి సీక్వెల్ తీయాలని చాలా కాలంగా అనుకుంటున్నానన్నారు. ఒక చిత్రాన్ని సీక్వెల్ అంటే ముందు చిత్రానికి పని చేసిన నటీనటులు, సాంకేతిక వర్గం పని చేయాలని ఏమీ లేదన్నారు.
దర్శకులు విష్ణువర్ధన్, చక్రితోలేటి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన శరత్ చెప్పిన కథ నచ్చడంతో దాన్ని కో-2గా నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఇటీవల సహాయ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న బాబిసింహా హీరోగాను, నటి నిక్కి గల్రాణి హీరోయిన్‌గాను నటించనున్న ఈ చిత్రంలో నటుడు ప్రకాష్‌రాజ్ ముఖ్యపాత్ర పోషించనున్నట్లు వెల్లడించారు. కో చిత్రం మాదిరిగానే ఈ సీక్వెల్ కథ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని ఆశాభావాన్ని నిర్మాత వ్యక్తం చేశారు. చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని ఆయన తెలిపారు.