ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాపనుల శాఖ, స్థానిక సంస్థల మధ్య సమన్వయ లోపం ప్రజల పాలిట శాపంగా మారింది.
► శాఖల మధ్య సమన్వయ లోపం
► కాల్వల పూడికతీతపై నువ్వా.. నేనా
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాపనుల శాఖ, స్థానిక సంస్థల మధ్య సమన్వయ లోపం ప్రజల పాలిట శాపంగా మారింది. నగరంలో ప్రవహించే కాల్వల పూడికతీత పనుల బాధ్యత నీదంటే నీదనే వాదనలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దక్షిణ చెన్నై శివార్లలో 20కిపైగా చిన్నపాటి నదులు, చెరువులు ఒకటితో ఒకటి కలిసిపోయినట్లుగా మారిపోయి ఉన్నాయి. ప్రజా పనుల శాఖ పరిధిలో ఈ చెరువులు ఉన్నాయి. చేంబాక్కం, మాడంబాక్కం, రాజకీళంబాక్కం, సేలయూరు, సిటిలంబాక్కం, నెమిలిచ్చేరి, పల్లవరం, కీళ్‌కట్టలై, కోవిలంబాక్కం, పల్లికరనై చెరువులు ఒకదానికి ఒకటిగా అనుసంధానమై ఉన్నాయి. వర్షాకాలంలో ఒక చెరువు నిండితే దాని నుంచి పొంగే నీరు మరో చెరువులోకి ప్రవహించేలా పంటకాల్వల నిర్మాణం జరిగింది.
ఈ కాల్వలన్నీ ప్రజాపనులశాఖ పరిధిలోనివి. ఈ చెరువులు, కాల్వల నిర్వహణ, పర్యవేక్షణ పూర్తిగా ప్రజా పనులశాఖదే బాధ్యతని ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా పేర్కొని ఉంది. అయితే చెరువుల్లోకి వరదనీరు ప్రవహింపజేసే కాల్వలు కొన్నేళ్లుగా పూడికతీతకు నోచుకోక డ్రైనేజీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ మురుగునీరు పొంగిపొర్లిఇతర చెరువుల్లో చేరుతూ మంచినీటిని సైతం మురుగునీరుగా మార్చేస్తున్నాయి. డ్రైనేజీ నీరు సక్రమంగా పారుదల జరిగేలా బాధ్యత వహించాల్సిన స్థానిక సంస్థలు ప్రజా పనులశాఖపైకి నెట్టివేస్తూ మిన్నకుండి పోతున్నాయి. డ్రైనేజీ నీటి బాధ్యత స్థానిక సంస్థలది కాబట్టి తమ జోక్యం ఉండదని ప్రజాపనుల శాఖ పట్టించుకోవడం మానేసింది.
ఇలా స్థానిక సంస్థలు, ప్రజాపనులశాఖలు సమన్వయంగా వ్యవహరించడం మానివేసి ఘర్షణ పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నవంబర్, డిసెంబర్ మాసాల్లో కురిసే వర్షాల వరదనీరు జనావాసాల్లోకి ప్రవహించే ప్రమాదం ఉంది. బాధ్యతా రాహిత్యమైన ఈ వ్యవహారంపై ప్రజాపనుల శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ నగర శివార్లలోని అనేక కాలువలు, చెరువులు ఆక్రమణలకు గురై ఉన్నాయని, అన్ని పంటకాలువల్లోనూ డ్రైనేజీ నీరే ప్రవహిస్తోందని అంగీకరించారు. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం స్థానిక సంస్థల నిర్వాహకులని ఆయన ఆరోపించారు.
కాల్వల్లో పూడిక తీత పనులను నిర్వహించక వరద ముంపు ఏర్పడితే ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదేనని ఆయన అన్నారు. పూడిక తీత పనుల్లో ప్రజాపనుల శాఖ జోక్యం చేసుకున్నట్లయితే కాల్వల్లోకి డ్రైనేజీ నీరు ప్రవహించకుండా పూర్తిగా అడ్డుకోవాల్సి వస్తుందని, దీని వల్ల ఏర్పడే పరిణామాలకు స్థానిక సంస్థలే జవాబు చెప్పుకోవాలని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల, ప్రజాపనుల శాఖ అధికారులు పరస్పర నిందారోపణలు ప్రజలకు తలనొప్పిగా మారాయి. పూడిక తీత పనుల చేయకపోవడం, చెరువులు, కాల్వల ఆక్రమణలే గత ఏడాది డిసెంబర్ వర్షాలు చెన్నై నగరాన్ని ముంచెత్తాయి. అన్ని శాఖలపైనా అజమారుుషీ కలిగిన జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.