రైలులో వధువుపై లైంగికదాడికి యత్నం
Published Thu, Sep 19 2013 2:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు నుంచి అరక్కోణానికి వెళుతున్న రైలులో వధువుపై లైంగికదాడికి యత్నించిన ఇద్దరు యువకులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. వేలూరు జిల్లా అరక్కోణం ప్రాంతానికి చెందిన వ్యవసాయ కూలీ తంగవేలు(27). ఇతనికి అదే ప్రాంతానికి చెందిన షర్మిల(23)తో 15 రోజుల క్రితం వివాహం జరిగింది. మంగళవారం తిరువళ్లూరులోని వీరరాఘవ స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం పట్టణంలోని పోస్టాఫీసు వద్దనున్న బంధువుల ఇంటికి వెళ్లారు.
రాత్రి 11.30 గంటలకు చెన్నై నుంచి అరక్కోణం వైపు వెళుతున్న రైలు ఎక్కారు. వీరిద్దరూ ఒంటిరిగా వెళుతున్న విషయాన్ని గమనించిన ఇద్దరు యువకులు అదే రైలు పెట్టేలో ఎక్కారు. రైలు తిరువళ్లూరు నుంచి యాగట్టూరు వద్దకు రాగానే రైలులో ఉన్న తంగవేలును చితకబాది షర్మిలను బలవంతంగా రైలులో నుంచి దింపారు. భార్యను కిందకు దింపుతున్న విషయాన్ని గ్రహించిన తంగేవుల వారి వెంబడించారు. రైలు వెళ్లిపోవడంతో షర్మిలను పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లేందకు యత్నించారు. తంగవేలు గట్టిగా కేకలు వేశారు. దీని గమనించిన స్థానికులు అక్కడికి పరుగులు తీశారు.
గామస్తులు వస్తున్న విషయాన్ని గమనించిన యువకులు షర్మిలను వదిలి పెట్టి పరారయ్యారు. అయితే టార్చ్‌లైట్ల సహా యంతో గ్రామస్తులు నిందితులను పట్టుకుని చితకబాది కడంబత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో యువకులు తిరువళ్లూరు జిల్లా పెరియకుప్పం ప్రాంతానికి చెందిన లారన్స్, సాలమాన్‌గా గుర్తించి వారిని అరెస్టు చేశారు. రాత్రుళ్లు రైళ్లలో భద్రత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement