శక్తి మిల్లు కాంపౌండ్‌లో ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన అత్యాచార సంఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
సాక్షి, ముంబై: శక్తి మిల్లు కాంపౌండ్‌లో ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన అత్యాచార సంఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. నగరంలో ప్రతిరోజూ సరాసరి మూడు అత్యాచార సంఘటనలు జరుగుతున్నట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది కాలంలో ఏకంగా 1,839 మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు.
నగరం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన అత్యచారం, వేధింపుల కేసుల్లో అత్యధిక శాతం నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నిందితులకు శిక్షపడకుండా ఉన్న కేసుల విషయంలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. లైంగిక వేధింపుల కేసుల్లో 84 శాతం మంది నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరిం చిన వివరాల ద్వారా బయటపడింది. కేవలం 16 శాతం మంది నిందితులకే శిక్ష పడిందని వివరాల ద్వారా తెలిసింది.
వివరాలిలా ఉన్నాయి...
ఈ ఏడు ముంబైలో జూన్ వరకు అత్యాచార సంఘటనలు 202, అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనలు 553, ఈవ్‌టీజింగ్ కేసులు 277, అదనపు వరకట్న హత్యలు ఏడు చోటుచేసుకున్నాయి. గత ఏడాది ముంబైలో సామూహిక అత్యాచారాలు 232, అసభ్యకరంగా ప్రవర్తించడంపై 614, ఈవ్‌టీజింగ్ 235, అదనపు వరకట్నం వేధింపుల కేసులు 11 నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అదేవిధంగా 2012లో మహారాష్ట్రలో అత్యాచారం కేసులు 1,845, అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై 3,935 కేసులు నమోదయ్యాయి.
అలాగే ఈ ఏడు జూన్ వరకు రాష్ర్టంలో అత్యాచారం కేసులు 1,542, అసభ్యకరంగా ప్రవర్తించినవారిపై 3,835 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు కేసులు రెట్టింపు నమోదైనట్లు స్పషమవుతోంది. కాగా సామూహిక అత్యాచార సంఘటనలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది.