అలాంటివాళ్లను బహిరంగంగా చంపాలి
న్యూఢిల్లీ: ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులు ఉగ్రవాదులని, వాళ్లను బహిరంగంగా చంపాలని అన్నారు. అత్యాచార కేసుల్లో దోషులను ఉగ్రవాదులుగా పరిగణించి, బహిరంగంగా చంపేలా పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలని మిశ్రా డిమాండ్ చేశారు. అలాగే మహిళలకు ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.
ఢిల్లీ- కాన్పూర్ హైవేపై కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అటకాయించి, తల్లీకూతుళ్లపై దుండగులు గ్యాంగ్ రేప్ చేసిన అనంతరం మంత్రి తన బ్లాగ్లో ఈ వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. గతేడాది ఢిల్లీలో 450 మంది మైనర్ బాలికలు లైంగికదాడికి గురయ్యారని వెల్లడించారు. ఏ సమయంలోనైనా, ఎవరికైనా ఇలాంటి దుస్థితి రావచ్చని, రేప్ కేసుల దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఉరిశిక్షకు తాను చాలాకాలం వ్యతిరేకమని, అయితే రేపిస్టులు ఉగ్రవాదులని, వారికి మరణశిక్ష విధించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.