
కిచ్చా సుదీప్ రికార్డు రెమ్యునరేషన్!
- కిచ్చా సుదీప్ రికార్డు రెమ్యునరేషన్!
- తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టనున్న కన్నడ హీరో
సాక్షి, బెంగళూరు : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమా కిచ్చా సుదీప్‌లోని నటవిశ్వరూపాన్ని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. శాండల్‌వుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సాధించుకున్న సుదీప్ ఈ సినిమాతో టాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ ఫేమస్ అయిపోయాడు. దీంతో త్వరలోనే తెరకెక్కనున్న రజనీకాంత్ సినిమాలో సుదీప్ విలన్‌గా కనిపిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అంతకంటే ఓ ముఖ్యమైన వార్త శాండల్‌వుడ్‌లో వినిపిస్తోంది.
అదేంటంటే ‘ఇళయ దళపతి’గా కోలీవుడ్‌లో ఖ్యాతినార్జించిన విజయ్ సినిమాలో సుదీప్ కూడా కనిపించనున్నారట. ఈ సినిమా ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి సుదీప్ అడుగుపెట్టనున్నారు. గత సోమవారమే ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సుదీప్ సంతకం చేశారని శాండల్‌వుడ్ వర్గాల సమాచారం. ఇక ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమా కోసం అక్షరాల రూ.6 కోట్ల పారితోషికాన్ని కిచ్చా సుదీప్ అందుకోనున్నారు.
శాండల్‌వుడ్‌లో ఇదో రికార్డు అనే చెప్పవచ్చు. ఎందుకంటే శాండల్‌వుడ్‌లో అగ్ర కథానాయకుడిగా ఉన్న దర్శన్ ప్రస్తుతం అత్యధికంగా రూ.5.5 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు దర్శన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.6 కోట్ల పారితోషికాన్ని సుదీప్ అందుకుంటున్నారు. ఇక ప్రముఖ దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణె, శృతిహాసన్‌లు హీరోయిన్లుగా కనిపించనున్నారని సమాచారం.