తమ పార్టీకి రాజ్యసభ స్థానం కేటాయింపుపై శివసేన, బీజేపీలే నిర్ణయం తీసుకుంటాయని ఆర్‌పీఐ నాయకుడు రాందాస్ ఆఠవలే పేర్కొన్నారు.
ముంబై: తమ పార్టీకి రాజ్యసభ స్థానం కేటాయింపుపై శివసేన, బీజేపీలే నిర్ణయం తీసుకుంటాయని ఆర్‌పీఐ నాయకుడు రాందాస్ ఆఠవలే పేర్కొన్నారు. శివసేన నాయకుడు ఉద్ధవ్‌ఠాక్రేని శుక్రవారం ఆయన మాతోశ్రీలో కలుసుకుని ఈ అంశంపై చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మూడు లోక్‌సభ సీట్లతోపాటు ఒక రాజ్యసభ స్థానాలను కేటాయించాలంటూ కోరామన్నారు. ఇందుకు ఉద్ధవ్ స్పందిస్తూ బీజేపీతో చర్చించినఅనంతరం సీట్లను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారన్నారు. కాగా శివసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకున్న ఆర్‌పీఐ వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమకు 35 స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే.
ఢిల్లీకి మనోహర్?
సాక్షి, ముంబై: శివసేన పార్టీ అగ్రనాయకుడు మనోహర్ జోషీ ఢిల్లీ వెళ్ల్లనున్నట్లు వచ్చిన వదంతులు రాజకీయాల్లో దుమారం రేపాయి. అయితే తనను ఢిల్లీకి ఎవరూ ఆహ్వానించలేదని, ప్రస్తుతం ముంబైలోనే ఉన్నానంటూ ఆయన మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ మధ్య ముంబై స్థానం ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిరాకరించింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళుతున్నారంటూ వదంతులు వ్యాపిం చాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ , కాంగ్రెస్ మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్‌లను కలుస్తారనే పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాకుండా రాజ్‌నాథ్ సింగ్‌ను కలసిన తరువాత శరద్ యాదవ్ రాజీనామాతో ఖాళీ అయిన రాష్టీయ లోక్‌షాహి ఆఘాడి (ఆర్‌ఎల్‌ఏ) సమన్వయకర్త పదవిని దక్కించుకునే ప్రయత్నాలు చేయనున్నారంటూ చర్చించుకోవడం మొదలైంది. అయితే అదేమీ లేదంటూ ఎన్సీపీ కార్యాలయాల వర్గాలు వెల్లడించాయి. మరోవైపు జోషి ఎక్కడున్నారనే విషయంలోనూ అనేక అనుమానాలు తలెత్తాయి. ఆయన మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో దీనిపై మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే మనోహర్‌తో మాట్లాడేందుకు ఓ టీవీ చానల్ చేసిన ప్రయత్నం ఫలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.