వచ్చేనెల 7న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దించాలనే విషయమై పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
సాక్షి, ముంబై: వచ్చేనెల 7న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దించాలనే విషయమై పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల నుంచి ఇద్దరి చొప్పున, బీజేపీ నుంచి ఒకరి పదవీ కాలం ముగియనుండడంతో వీరి స్థానాల్లో ఎవరిని బరిలోకి దించాలనే విషయమై పార్టీల పెద్దలు తంటాలు పడుతున్నారు. ప్రకాశ్ జావ్దేకర్‌కే మళ్లీ అవకాశమివ్వాలని బీజేపీ దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం.
ఇక కాంగ్రెస్ నుంచి పదవీ విరమణ చేయనున్న హుస్సేన్ దల్వాయి, మురళీ దేవరా స్థానాల్లో ఎవరిని బరిలోకి దించాలనే విషయమై ఆ పార్టీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్సీపీ నుంచి ఇప్పటిదాకా ప్రాతినిథ్యం వహించిన వైపీ త్రివేది, జనార్థన్ వాఘ్మరే స్థానాల్లో ఒకరి స్థానంలో పార్టీ అధినేత శరద్ పవార్ బరిలోకి దిగనున్నారని ఎన్సీపీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. ఇక శివసేన ఉంచి రాజ్‌కుమార్ ధూత్, భరత్‌కుమార్ రావుత్ పదవీ విరమణ చేయనుండడంతో వారి స్థానాల్లో కూడా ఎవరిని బరిలోకి దించనున్నారనే విషయమై ఆ పార్టీ ఇంకా స్పష్టతనివ్వలేదు. అయితే వీరిద్దరు మరోసారి రాజ్యసభ అవకాశాన్ని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఎన్సీపీకి చెందిన మరో స్థానం నుంచి ఫౌజియాఖాన్‌ను బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఏడో అభ్యర్థి ఎవరో?
కాంగ్రెస్, ఎన్సీపీలకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున గెలిపించుకునే సంఖ్యాబలం ఉంది. అయితే బీజేపీ, శివసేనలకు ఒకే అభ్యర్థిని గెలిపించుకునే సంఖ్యాబలం ఉండడంతో మరి ఏడో అభ్యర్థి ఏ పార్టీ నుంచి ఎన్నికవుతారనే విషయంలో సందిగ్ధత నెలకొంది. మిగిలిన ఏడో స్థానం కోసం బిల్డర్ సంజయ్ కాకడే, శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.