
ఆడియో టేప్ దుమారం
శాండల్‌వుడ్ నటుడు దర్శన్ కుటుంబ జీవితంలో రేగిన కల్లోలం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది.
- విజయలక్ష్మిని దర్శన్ దూషిస్తున్నట్లుగా ఆడియో టేప్
- సమసిపోని దర్శన్ దంపతుల గొడవ
- అంబరీష్ చర్చలు
బెంగళూరు: శాండల్‌వుడ్ నటుడు దర్శన్ కుటుంబ జీవితంలో రేగిన కల్లోలం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. విజయలక్ష్మిని దర్శన్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లుగా ఓ ఆడియో టేప్ వాట్సాప్‌లో సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం వాట్సాప్ గ్రూప్‌లలో వినిపించిన ఈ ఆడియోటేప్‌లో అత్యంత అసభ్య పదజాలం వినిపించింది. అయితే ఈ ఆడియో టేప్‌లో ఉన్నది దర్శన్ గొంతు కాదని ఆయన భార్య విజయలక్ష్మి చెబుతుండడం గమనార్హం. ‘ పదమూడేళ్లుగా దర్శన్‌తో కలిసి ఉన్నాను, ఆయన నోటి వెంట ఎప్పుడూ ఇలాంటి పదజాలాన్ని నేను వినలేదు. అసలు ఆ గొంతు దర్శన్‌ది కాదు, మా మధ్య ఉన్న మనస్పర్థలను ఉపయోగించుకొని ఎవరో ఇదంతా సృష్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
ఇక విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్శన్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఉదయమే విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు దర్శన్‌కు సూచించినప్పటికీ తన తల్లికి అనారోగ్యంగా ఉన్న కారణంగా శుక్రవారం సాయంత్రం సమయానికి విచారణకు హాజరవుతానని దర్శన్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
ఇదే సందర్భంలో దంపతులిద్దరి మధ్య నెలకొన్న మనస్పర్ధలను రాజీ ద్వారా నివృత్తి చేసేందుకు అటు రాష్ట్ర మహిళా కమిషన్‌తో పాటు సీనియర్ నటుడు అంబరీష్ సైతం ప్రయత్నిస్తున్నారు.