చెన్నై: తమిళనాడు రాజకీయం వేడేక్కింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నా డీఎంకే చీఫ్ శశికళ, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అసెంబ్లీని సమావేశపరిచి, మెజార్టీ ఉన్న వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ విద్యాసాగర్ రావుకు భారత అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇవ్వగా.. శశికళపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేపు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠగా మారింది. శశికళ మరోసారి కువతూరు సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్కు వెళ్లి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ రోజు రాత్రికి ఆమె అక్కడే బస చేయనున్నారు. మూడు రోజుల్లో ఆమె ఎమ్మెల్యేలను కలవడమిది మూడోసారి.
తాజా రాజకీయ పరిస్థితులపై శశికళ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. అన్నా డీఎంకేలో ప్రస్తుత సంక్షోభానికి డీఎంకేనే కారణమని నిందించారు. ఎంజీఆర్ మరణించినపుడు కూడా డీఎంకే ఇలాగే వ్యవహరించిందని చెప్పారు. ఈ సందర్భంగా శశికళ జయలలితను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అమ్మ ఇప్పటికీ మన గుండెల్లో ఉందని అన్నారు. తాను రిసార్ట్‌కు వచ్చే దారిలో కొందరు తనను ఓ గుడిసెలోకి ఆహ్వానించారని, లోపలకు వెళ్లి చూడగా అమ్మ ఫొటో కనిపించిందని, ప్రజల గుండెల్లో అమ్మ జీవిస్తున్నారని చెప్పారు. తమకు ఇపుడు సవాళ్లు ఎదురయ్యానని, అందరం కలసికట్టుగా ఎదుర్కోవాలన్నారు.
ఇదే రోజు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యలయంలో సీనియర్ నేతలతో సమావేశమై తాజా పరిణామాలను చర్చించారు. అన్నా డీఎంకే తమ ప్రత్యర్థి పార్టీ అని, పన్నీరు సెల్వంకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. గవర్నర్ వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, మెజార్టీ ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని స్టాలిన్ చెప్పారు. ఇక చేరికలు, మద్దతు దారులతో ఉత్సాహంగా ఉన్న పన్నీరు సెల్వం శిబిరం ఈ రోజు కాస్త ఢీలాపడింది. సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.