
పేద విద్యార్థుల కోసమే పథకాలు
పేద విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తోందని రాష్ట్ర మంత్రి రమణ అన్నారు...
తిరువళ్లూరు: పేద విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తోందని రాష్ట్ర మంత్రి రమణ అన్నారు. తిరువళ్లూరు జిల్లాలోని అంబత్తూరు పరిధిలో ఎస్‌ఆర్‌ఎం పాఠశాలలో 315 మందికి, కామరాజర్ మహోన్నత పాఠశాలల్లో 716 మందికి, మొగప్పేర్ పాఠశాలలో 130 మందికి, కొప్పూర్ పాఠశాలల్లో 94 మందికి, మనవాలనగర్‌లోని నటేషన్ చెట్టియార్ పాఠశాలలో 275 మందికి, విడయూర్ పాఠశాలలో 45 మందికి, కడంబత్తూరులో 175 మందికి, డాన్‌బాస్కో పాఠశాలలో 182 మందికి, పేరంబాక్కం పాఠశాలల్లో 83 మంది సహా 2,562 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను మంత్రి రమణ అందజేశారు.
కార్యక్రమానికి కలెక్టర్ వీరరాఘవరావు అధ్యక్షత వహించగా మంత్రి రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి రమణ మాట్లాడుతూ తమ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో అత్యధిక బడ్జెట్‌ను విద్య కోసం కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పథ కాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే మణిమారన్, జెడ్పీ చైర్మన్ రవిచంద్రన్, యూనియన్ చైర్మన్ దక్షణామూర్తి, వైస్ చైర్మన్ సుధాకర్ హాజరయ్యారు.