‘ట్రిపుల్ తలాక్’ సమీక్షను ఒప్పుకోం
సుప్రీంలో ఏఐఎంపీఎల్‌బీ పిటిషన్
న్యూఢిల్లీ: మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే అంశంపై విచారణ చేపట్టడాన్ని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారన్న నెపంతో వ్యక్తిగత చట్టాలను సవాల్ చేయలేరని సుప్రీం కోర్టుకు తెలిపింది.
ముస్లిం వ్యక్తిగత చట్టాలను సమీక్షించి, వివాహం, విడాకులపై ముస్లిం మహిళల కోసం ప్రత్యేక నిబంధనలు చేయడాన్ని తాము ఒప్పుకోమని, ఇలా చేస్తే శాసన వ్యవస్థలో కోర్టులు జోక్యం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొంది. ఈమేరకు ఏఐఎంపీఎల్‌బీ కోర్టుకు సమర్పించిన తాజా పిటిషన్‌లో పేర్కొంది. లింగ సమానత్వం కింద ట్రిపుల్ తలాక్, నిఖా హలాల్ అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం సమీక్ష చేయలంటూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది.
‘తలాక్’కు కేంద్రం వ్యతిరేకం: వెంకయ్య
కొచ్చి: ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళలకు హాని అని, కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తోందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం కొచ్చిలో అన్నారు.