
ఏడు నిమిషాలకు.. రూ. 6 కోట్లు!
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : పలానా హీరోయిన్ పారితోషికం కోటిన్నర, రెండు కోట్లు అన్నవార్త వినగానే అమ్మో అని ఆశ్చర్యపోతుంటాం. ఈ పారితోషికానికి ఆ హీరోయిన్లు 20 నుంచి 30 రోజులు కాల్‌షీట్స్ కేటాయించాల్సి ఉంటుంది. అయితే కేవలం ఏడు నిమిషాల స్టేజీ డాన్స్ కోసం ఆరు కోట్లు పారితోషికం తీసుకుంటున్న నటి గురించి వింటే విస్తుపోవాల్సిందే! అలాంటి క్రేజీ నటి బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా. హిందీ హీరోయిన్ గురించి మనకెందుకంటారా? ఎందుకంటే ఈ బ్యూటీ చిందేస్తుంది చెన్నైలో కాబట్టి.
నూతన సంవత్సరం వస్తుందంటే క్రేజీ హీరోయిన్లకు కాసుల వర్షమే. నక్షత్ర హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో నిర్వహించే పార్టీల్లో ఈ ముద్దు గుమ్మల చిందులకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో బాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రా చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో డాన్స్ వేయడానికి అంగీకరించింది. ఏడు నిమిషాల పాటు ఆడే ఆ డాన్స్ ఖరీదు అక్షరాలా ఆరు కోట్లు అట. ప్రియాంకా చోప్రానా మజాకా.