లైంగిక దాడులకు పాల్పడితే చర్యలు
Published Thu, Feb 27 2014 1:01 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు నివారణ, వారికి భద్రత కల్పించే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి చిన్నారుల సంక్షేమశాఖ అధికారి సయ్యద్, కలెక్టర్ వీరరాఘవరావు హాజరయ్యారు. కలెక్టర్ వీరరాఘవరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బాలకార్మికుల వ్యవస్థను పూర్తిగా నిషేధించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇటుక బట్టీల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రతి ఇటుక బట్టీ, రైస్‌మిల్ వద్ద బాలకార్మికులు లేరన్న బోర్డును ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. చిన్నారులు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement