ముఖ్యమంత్రి మాట తప్పారు
• ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై మండలిలో విపక్షాల ఫైర్
• మూడేళ్లుగా బకాయిలు ఎందుకు చెల్లించడం లేదన్న షబ్బీర్‌అలీ
• విద్యార్థులెవరూ ఇబ్బంది పడడం లేదన్న అధికార పక్షం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై శాసన మండలి దద్దరిల్లింది. మూడేళ్లు గా రూ.4,400 కోట్ల బకాయిలను ఎందుకు చెల్లించ లేదంటూ ప్రభుత్వాన్ని విపక్ష సభ్యులు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి నిలదీశారు. ప్రభుత్వ తీరుతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు.
అసెంబ్లీ సాక్షిగా చెప్పి చెల్లించలేదు
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. విద్యార్థులకు సంబంధించి రూ.3,068 కోట్ల ఫీజు బకాయిలను గతేడాది ఏప్రిల్ 1లోగా చెల్లిస్తామని మార్చి 29న అసెంబ్లీలో సీఎం హామీ ఇచ్చారని.. కానీ బకాయిలు చెల్లించలేదని ధ్వజమెత్తారు. దీనిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు. ఆర్థికంగా వెనుబడిన విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో 2008లో వైఎస్సార్ ప్రభుత్వం ‘ఫీజు’ పథకాన్ని ప్రవేశపెట్టి, చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పథకానికి నాడు 16 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే.. ప్రస్తుతం 12.97 లక్షలకు ఎందు కు తగ్గిందో చెప్పాలన్నారు. ఫీజులు, మెస్ చార్జీలు, ఉపకార వేతనాలు అందని కారణం గా ఈ ఏడాది 60 శాతం అడ్మిషన్లు తగ్గాయని చెప్పారు. ఫీజుల కోసం విద్యార్థులు తిరుగు తున్నారని.. యాజమాన్యాలు చేస్తున్న అవమా నాలతో ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంతృ ప్తికరమైన సమాధానం ఇవ్వ నందున కాంగ్రెస్ సభ్యులంతా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏ ఇబ్బందీ లేదు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వా నికి, కాలేజీలకు మధ్య వ్యవహారమని, అందు లో విద్యార్థులెవరూ ఇబ్బందులు పడటం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
విడ్డూరంగా ఉంది: పొంగులేటి
ఫీజులు రాక ఏ విద్యార్థీ ఇబ్బందిపడటం లేదన్న అధికార పక్షం వాదన విడ్డూరమని పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నంబర్ ఇస్తే అసలు సంగతులు తెలుస్తాయన్నారు.
బకాయిలు వాస్తవమే: జగదీశ్‌రెడ్డి
2015–16కు సంబంధించి రూ.1,487 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయని.. 2016–17 ఫీజులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.