
అరకోటి అప్పులు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చోరీలు!
గత కొన్ని నెలలుగా చోరీలకు పాల్పడుతోన్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
నల్గొండ: గత కొన్ని నెలలుగా చోరీలకు పాల్పడుతోన్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన వినయ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి పలు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత 2005లో హైదరాబాద్‌లో సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రారంభించాడు. అందులో నష్టం రావడంతో కంపెనీ మూసేశాడు. ఈ క్రమంలో సుమారు రూ.60 లక్షల మేర అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చడానికి దొంగతనాలు చేయడమే మార్గమని భావించాడు.
విజయవాడ, రాజమండ్రిలలో కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, కార్లు, బంగారం చోరీచేస్తూ గతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. శిక్ష అనుభవించిన వినయ్ రెండు నెలల క్రితమే విజయవాడ జైలు నుంచి విడుదలయ్యాడు. జైలుకు వెళ్లి వచ్చినా అతని బుద్ధి మాత్రం మారలేదు. అక్కడ ఉంటే కష్టమేనని భావించి మకాం మార్చిన అతడు నల్గొండ జిల్లాపై కన్నేశాడు. నెంబర్‌ప్లేట్ లేని కారులో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి ఇప్పటికే నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. ఓ ఇంట్లో చోరీ చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.