రైల్వే స్టేషన్లలో సోలార్ వెలుగులు | Solar power to light up railway stations in Gurgaon | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్లలో సోలార్ వెలుగులు

Published Sat, Oct 26 2013 11:10 PM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

రైల్వే స్టేషన్లలో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇప్పటిదాకా స్టేషన్లలోని విద్యుద్దీపాల కోసం సంప్రదాయ ఇంధన వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్న

గుర్గావ్: రైల్వే స్టేషన్లలో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇప్పటిదాకా స్టేషన్లలోని విద్యుద్దీపాల కోసం సంప్రదాయ ఇంధన వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తునే వినియోగిస్తున్నారు. మొట్టమొదటిసారిగా సంప్రదాయేతర ఇంధన వనరులతో తయారు చేసిన విద్యుత్తుతో గుర్గావ్ రైల్వే స్టేషన్ వెలిగిపోనుంది. సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన 24 కేవీ పవర్ ప్లాంట్‌కు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి అధిర్ రంజన్ శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత గుర్గావ్ రైల్వే స్టేషన్ పూర్తిగా సోలార్ విద్యుత్ ఆధారంగానే పనిచేస్తుందని రంజన్ తెలిపారు. 
 
ఆయన మాట్లాడుతూ... ‘సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టిసారించాల్సిన సమయమిది. కనీసం స్టేషన్లలో విద్యుద్దీపాలు వెలిగేందుకైనా సౌరవిద్యుత్‌ను ఉపయోగించుకోవాలి. ఆ ఉద్దేశంతోనే రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(ఆర్‌ఐటీఈఎస్) చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. 2020 నాటికి  20,000 మెగావాట్ల సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా ఆర్‌ఐటీఈఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంద’న్నారు. ఆర్‌ఐటీఈఎస్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ రాజీవ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ విద్యుత్ కేంద్రం సంప్రదాయేతర   ఇంధన వనరుల వినియోగంలో ఓ మైలురాయి అవుతుందన్నారు. ఇకపై గుర్గావ్ రైల్వే స్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్థలో ఎటువంటి సమస్యలు తలెత్తవన్నారు. 
 
సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవడం ద్వారా సంప్రదాయేతర ఇంధన వనరులు వృథాకాకుండా చూడడమేకాదు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తెచ్చినవారమవుతామన్నారు. ఇండియన్ రైల్వే, ఢిల్లీ సర్కిల్ డీఆర్‌ఎం ఏకే సచన్ మాట్లాడుతూ.. స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై ఓ షెల్టర్‌ను ఏర్పాటు చేస్తామని, అక్కడి నుంచి స్టేషన్ మొత్తానికి సోలార్ విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. దీంతో స్టేషన్ మొత్తం సోలార్ వెలుగులతో వెలిగిపోతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement