సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను తిరిగి బీజేపీలో చేర్చుకునే విషయమై త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పార్టీ రాష్ర్ట కోర్ కమిటీ అధిష్టానాన్ని కోరింది. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యడ్యూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకు రావడంపై సుదీర్ఘ చర్చ జరిగింది.
అనంతరం పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై చర్చించారు. రాష్ట్రంలో వివిధ చోట్ల ఆయన బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయినందున కొత్త పదాధికారుల నియామకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ రాష్ట్ర శాఖను పునర్వ్యవస్థీకరించడంపై కూడా చర్చ సాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ ముఖ్యమంత్రులు సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, ఆర్. అశోక్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు సంతోష్ పాల్గొన్నారు.
అధిష్టానం కోర్టులో బంతి
యడ్యూరప్పను తిరిగి బీజేపీలో చేర్చుకునే విషయమై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని జోషి తెలిపారు. కోర్ కమిటీ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ ఆయన తిరిగి బీజేపీలోకి వస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. తమ నిర్ణయమేమిటో ఇదివరకే చెప్పినందున, బంతి అధిష్టానం కోర్టులో ఉందని అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి యడ్యూరప్ప మద్దతు తెలపడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. బీజేపీని వీడిన వారందరూ జాతి ప్రయోజనాల దృష్ట్యా తిరిగి వెనక్కు వస్తే మంచిదని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నర హంతకుడని అభివర్ణించడంపై మండిపడుతూ, వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏదో ఒకటి తేల్చండి
Published Fri, Sep 20 2013 3:55 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement