► వర్దా బాధిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన
► పరామర్శలు...పలకరింపులు
►షార్ట్‌ఫిల్‌్మలా సాగిన స్టాలిన్ పర్యటన
► వ్యవసాయరుణాలు రద్దు చేయాలని డిమాండ్
తిరువళ్లూరు : వర్దా తుపాను సృష్టించిన బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన రైతులకు తక్షణ సాయం అందించడంతో పాటు జాతీయ బ్యాంకుల ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాలను వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్ష నేత స్టాలిన్ అన్నారు. వర్దా తుపాను బీభత్సానికి భారీ నష్టం ఏర్పడడంతో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యం లో తిరువళ్లూరు జిల్లా తుపాను బాధిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటించి బాధితులకు సహాయకాలను పంపిణీ చేయడంతో పాటు రైతులను పరామర్శించారు. మొదట కొండంజేరి ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే పదికిలోల బియ్యం, దుప్పటితో పాటు పలు సహాయకాలను పంపిణీ చేశారు.
అనంతరం సత్రం వద్ద రైతులను పరామర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా అసెంబ్లీలో పోరాటం చేస్తామని హమీ ఇచ్చారు. అక్కడి నుంచి విడయూర్‌కు వెళ్లగా మధ్యలో కన్నిమానగర్ ప్రజలు తమ సమస్యలను స్టాలిన్ దృష్టికి తెచ్చారు. తాగునీరు, విద్యుత్ సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. అనంతరం విడయూర్, తిరువళ్లూరు, వల్లువర్‌పురం ప్రాంతాల్లో స్టాలిన్పర్యటించి సహాయకాలను అందజేశారు.
వ్యవసాయ రుణాలను రద్దు చేయాలి :
సహాయకాల పంపిణీ అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ వర్దా తుపాను వల్ల కాంచీపురం, తిరువళ్లూరులో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందని, వారికి అండగా నిలిచేం దుకు రుణాలను రద్దు చేయడంతో పాటు తక్షణ సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్దా తుపానుకు తిరువళ్లూరు తీవ్రంగా నష్టపోయినా సహాయకాలు మాత్రం అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలో ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వ అసమర్థత బయటపడిందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల నుంచి తమిళనాడులో తరచూ విపత్తులు సంభవిస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో సాయం చేయడం లేదని విమర్శించారు.
ప్రస్తుతం వర్దా తుపానుకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని తాము డిమాండ్ చేసినా రూ.500కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. విపత్తు సంభవించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి సరిపుచ్చుకుంటుందని విమర్శించిన ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా కలిసి నష్టాన్ని వివరించి నిధులను రాబట్టాలని సూచించారు. వర్దా తుపాను నష్టాన్ని అంచనా వేసేందుఉ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించాలని లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే ఐఏఎస్‌లతో ప్రత్యేక కమిటీని నియమించి కేంద్రం సాయం కోరాలని సూచించారు. వర్దా తుపానుతో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకునీ జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
షార్ట్ ఫిల్‌్మలా సాగిన స్టాలిన్ పర్యటన: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా స్టాలిన్ పర్యటన పరామర్శలు, పలకరింపులతో సాగింది. ప్రతి చోటా ఐదు నిమిషాలు మాత్రమే ఆగిన స్టాలిన్, ఆ ప్రాంతాల్లో ప్రజల కష్టాలను వింటూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలు వినడం, కార్యకర్తలకు పలకరింపు, డీఎంకే నేతలకు సూచన, మీడియా పోలీసుల హడావిడి కనిపించింది. మొత్తానికి స్టాలిన్ పర్యటన షార్ట్ ఫిల్‌్మలా సాగింది.