అళగిరి కలకలం
డీఎంకే అధినేత కరుణానిధికి చెవిలో జోరీగలా తయారైన ఆయన తనయుడు, బహిష్కృత నేత అళ గిరి శుక్రవారం రాజకీయ కలకలం సృష్టించారు. డీఎంకేను దుయ్యబడుతూ తనదైన శైలిలో ముందుకెళుతున్న ఆయన శుక్రవారం సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలుసుకుని రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టించారు.
ప్రతి ఎన్నికల్లోనూ రజనీకాంత్ మద్దతు కోరని రాజకీయ పార్టీ ఉండదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయన క్రేజును ఓట్లుగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేయడం పరిపాటి. రజనీ కూడా ఒక్కోసారి ఒక్కో పార్టీకి మద్దతు పలుకుతుంటారు. ఈసారి మిగతా పార్టీలు ప్రయత్నించకున్నా బీజేపీ అన్ని కోణాల్లోనూ ప్రయత్నాలు చేసి విఫలమైంది. కోచ్చడయాన్ ఆడియో వేడుకల్లో రజనీ ని రాజకీయం గురించి ప్రశ్నించగా నో పాలిటిక్స్ అంటూ సున్నితంగా తప్పించుకున్నారు.
ఇదిలా ఉండగా తండ్రి కరుణానిధితో విభేదించి దూరంగా ఉంటున్న అళగిరిని ఎవ్వరూ బుజ్జగించి చేరదీసే ప్రయత్నాలు కూడా చేయలేదు. డీ ఎంకే అభ్యర్థుల జాబితాలో అళగిరికి, ఆయన అనుచరులకు చోటు దక్కలేదు. దీంతో మరింతగా విరుచుకుపడుతున్న అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలో అళగిరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. దీంతో కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు వచ్చాయి. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కావడం వల్ల ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే పుకార్లు షికారు చేశారుు. ఎండీఎంకే అధినేత వైగోను సైతం చెన్నై విమానాశ్రయంలో కలిసి ముచ్చటించారు. తన రాజకీయ ఎత్తుగడ ఏమిటో తెలియకుండా అన్ని పార్టీల్లో అయోమయ పరిస్థితిని సృష్టిస్తున్న అళగిరి అకస్మాత్తుగా రజనీకాంత్‌ను కలుసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తన కుమారుడు దురై దయానిధిని వెంటబెట్టుకుని శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ నివాసానికి చేరుకున్న అళగిరి సుమారు 15 నిమిషాలు మంతనాలు జరిపా రు. ఈ విషయం ముందుగానే బయటకు పొక్కడంతో పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు రజనీ నివాసం ముందు గుమికూడారు.
మట్టి గుర్రంపై సవారి అసాధ్యం
రజనీ ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన అళగిరి తానుగా ఏమీ చెప్పకుండా మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబు చెప్పారు. డీఎంకే ఒక మట్టిగుర్రం వంటి పార్టీ, అందులో సవారీ అసాధ్యం, పార్టీ గెలుపు కూడా అంతంత మాత్రమేనని అళగిరి వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒకటి లేదా రెండు స్థానాలు వస్తే పెద్ద గెలుపుగా భావించవచ్చన్నారు. లోపభూయిష్టమైన అభ్యర్థుల ఎంపిక, డబ్బుకు ప్రాధాన్యం, సిసలైన కార్యకర్తల విస్మరణే డీఎంకు శాపాలుగా మారతాయన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకేకు గట్టిపోటీ ఇచ్చేది బీజేపీ కూటమి మాత్రమేనని పేర్కొన్నారు.
ఈ నెల 16 వ తేదీన తన అనుచరులతో సమావేశమై భవిష్య ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. కొచ్చడయాన్ ఆడియో విడుదలపై మర్యాద పూర్వకంగా కలుసుకున్నానని తెలిపారు. తన కుమారుడు, నిర్మాత దురై దయానిధి రజినీతో చిత్రం చేసేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ అంశాన్ని కూడా ప్రస్తావించానన్నారు. తమ మధ్య రాజకీయాల ప్రస్తావనే రాలేదని తీవ్ర స్వరంతో బదులిచ్చారు.