తమిళనాడులో భారీ బందోబస్తు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు తమిళనాడు డీజీపీ ప్రకటించారు. 11 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, హైవేలపై భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు తమిళనాడు డీజీపీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాయి.
తమిళనాడులో ఈ రోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వెళ్లే బస్సులను రద్దు చేశారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద భద్రతను పెంచారు. జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. చుట్టుపక్కల షాపులను ఖాలీ చేయించారు. ఆస్పత్రి వద్ద భారీగా భద్రత బలగాలను మోహరించారు. అన్నా డీఎంకే నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
తమిళనాడులో 144 సెక్షన్ విధించారు. తమిళనాడు లోని అన్నీ పెట్రోలు బంకులను మూసేయాలని మౌఖికంగా అధికారులు ఆదేశించారు. అలాగే ఎక్కడికక్కడ ప్రభుత్వ బస్సులను ఆపేశారు. ఒక్క అపోలో ఆస్పత్రి వద్దనే 10 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. సెలవుల్లో ఉన్న అన్ని స్థాయిల్లోని పోలీసుల సెలవులు రద్దు చేశారు. వారు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేశారు. టీవీ ఛానెల్, దినపత్రికల ఎడిటర్లతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు కానీ డీజీపీ కానీ వారితో ప్రత్యేకంగా మాట్లాడుతారు. డాక్టర్లు అధికారికంగా ప్రకటించే అంశాలపై వార్తలు ప్రసారం, ప్రచురణ చేయాలే కానీ ప్రచారాలను పూర్తిగా విస్మరించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.