డీఎంకేతో సీట్ల పందేరానికి కమిటీని రంగంలోకి దించేందుకు ఏఐసీసీ నిర్ణయించింది. సీనియర్లు గులాంనబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్‌లతోపాటు రాష్ట్రానికి చెందిన నాయకులతో ఈ కమిటీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా కుష్బు, నగ్మాలను రంగంలోకి దించనున్నారు.
సాక్షి, చెన్నై: డీఎంకేతో కలసి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమైన విషయం తెలిసిందే. పాత స్నేహం మళ్లీ వికసించడంతో ఈ సారి డీఎంకేకు అధికార పగ్గాలు దక్కేందుకుగాను కాంగ్రెస్ చెమటోడ్చేందుకు సిద్ధం అవుతోంది. కాంగ్రెస్‌కు డీఎంకే యాభై సీట్లు ఇస్తున్నట్టు, ముప్పై సీట్ల్లిస్తున్నట్టుగా వస్తున్న సంకేతాలకు కల్లెం వేయడానికి టీఎన్‌సీసీ సిద్ధమైంది. సీట్ల పంపకాల్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు కమిటీని ప్రకటించాలని ఏఐసీసీ దృష్టికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తీసుకెళ్లి ఉన్నారు. డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ సైతం కాంగ్రెస్ కమిటీ రాకతో పొత్తు పందేరాలను కొలిక్కి తెచ్చి తదుపరి అధినేత కరుణానిధి మేనిఫెస్టోను ప్రకటిస్తారని వ్యాఖ్యానించిన విషయాన్ని ఢిల్లీకి ఈవీకేఎస్ చేర వేసి ఉన్నారు.
దీంతో కమిటీని చెన్నైకు పంపించేందుకు ఏఐసీసీ పెద్దలు నిర్ణయించి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కమిటీ మరో రెండు మూడు రోజుల్లో ఇక్కడికి వచ్చి కరుణానిధితో భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ కమిటీలో సీనియర్లు గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ పర్యవేక్షణలో రాష్ట్ర పార్టీకి చెందిన పలువురు నాయకులు నియమించే అవకాశాలు ఉన్నట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార బాధ్యతల్ని ఈవీకేఎస్ ఇళంగోవన్‌తో పాటు, నటి, పార్టీ మహిళా నేతలు కుష్బు, నగ్మాలకు అప్పగించేందుకు ఏఐసీసీ నిర్ణయించింది. ఈ నెల చివరి నుంచి నగ్మా పూర్తిగా తమిళనాడు మీద తన దృష్టిని పెట్టబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఇద్దరు మహిళా స్టార్లు డీఎంకే, కాంగ్రెస్ ప్రచారాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం అని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
సీట్లకు కమిటీ
Published Thu, Mar 17 2016 2:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement