సీఎం అభ్యర్థిగా కెప్టెన్
►కమలం పెద్దల నిర్ణయం..?
► విజయకాంత్‌తో చర్చల జోరు
► ఎన్‌డీఏలోనే ఆయన : పొన్ రాధాకృష్ణన్
► ప్రేమలతతో తమిళి సై భేటీ
సాక్షి, చెన్నై : బీజేపీ సీఎం అభ్యర్థిగా డీఎండీకే అధినేత విజయకాంత్ పేరును ప్రకటించేందుకు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో విజయకాంత్‌తో కమలనాథుల మంతనాలు జోరుగా సాగుతున్నాయి. ఇక, ఆయన ఎన్‌డీఏలోనే ఉన్నారని, ఉంటారంటూ కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏతో కలసి డీఎండీకే అధినేత విజయకాంత్ పయనించిన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో కమలనాథులతో అంటీఅంటనట్టు వ్యవహరించడం మొదలెట్టారు.
ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించిందన్న ఆగ్రహాన్ని పలు మార్లు వ్యక్తం చేసి ఉన్నారు. తాను ఎన్‌డీఏలో లేదన్నట్టుగా వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో విజయకాంత్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం పదవిని ఆయనకు కట్టబెట్టేందుకు తగ్గ మంతనాలు సాగినట్టు సమాచారం. అయితే, డీఎంకే, అన్నాడీఎంకేలకు తాను దూరం అని పదే పదే విజయకాంత్ వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు.
దీంతో డీఎంకే ప్రయత్నాలు నీరుగారినట్టు అయ్యాయి. అలాగే, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో కూడిన ప్రజా కూటమికి మద్దతుగా విజయకాంత్ వ్యాఖ్యలు అందుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకున్నట్టైంది. ఆయన వస్తే, అందరితో చర్చించి సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధం అని ఎండీఎంకే నేత వైగో ప్రకటించారు. దీంతో విజయకాంత్ అడుగులు ఆ వైపుగానే ఉంటాయన్న ప్రచారం బయలు దేరింది. ఈ సమయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయడానికి కమలనాథులు సిద్ధమైనట్టున్నారు. తమతో చేతులు కలిపిన పక్షంలో సీఎం అభ్యర్థిగా విజయకాంత్ పేరును తెర మీదకు తెస్తామో, తీసుకురామో అన్న బెంగ తో ఉన్న డీఎండీకే వర్గాల్లో నమ్మకాన్ని కల్గించే ప్రయత్నాలకు సిద్ధమయ్యారు.
ఢిల్లీలో పార్టీ అధినేత అమిత్‌షాతో సాగిన భేటీలో విజయకాంత్ ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. అలాగే, అన్నాడీఎంకేతో కలిసి నడవడం కన్నా, బీజేపీ, డీఎండీకే, ఇతర పార్టీలు కలిసి నడిస్తే లాభం ఉంటుంద న్న వాదనను కొందరు నేతలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో విజయకాంత్ ఇతర కూటమిలోకి వెళ్లకుండా, ఆయన్ను బీజేపీ వైపే ఉండే విధంగా మంతనాలు సాగించాలని అమిత్ షా ఆదేశించినట్టు తెలిసింది. ఆయన్ను బీజేపీ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించేం దుకు తగ్గ ఏకాభిప్రాయాన్ని పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తామన్న హామీని అమిత్ షా రాష్ట్ర పార్టీ నాయకులకు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. విజ యకాంత్ తమ చేతి నుంచి జారిపోకుండా జాగ్రత్తలకు సిద్ధమైన రాష్ట్ర నాయకులు మంతనాల జోరులో పడ్డట్టున్నారు.
ఇందుకు అద్దం పట్టే రీతిలో శనివారం విజయకాంత్‌తో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ , ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్‌తో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ భేటీ కావడం గమనార్హం. ఈ భేటీలో విజయకాంత్ ప్రజా కూటమి వైపుగా అడుగులు వేయకుండా, ఆయన మనస్సు మార్చే ప్రయత్నం చేసినట్టుగా కమలాలయం వర్గాలు పేర్కొం టున్నాయి. సీఎం అభ్యర్థిత్వానికి విజయకాంత్ పేరును తప్పకుండా తమ అధిష్టానం ప్రతిపాదిస్తుందన్న నమ్మకాన్ని కల్గించే యత్నం చేసినట్టు సమాచారం.
ఈ విషయంగా పొన్ రాధాకృష్ణన్‌ను కదిలించగా, ఆయన ఎన్‌డీఏ వెంటే అని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆయన తమతో కలిసి అడుగులు వేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇక, తమిళి సై సౌందరరాజన్‌ను కదిలించగా, తాను ప్రేమలతతో భేటీ కావడం కొత్తేమి కాదన్నారు. తరచూ తాము కలవడం జరుగుతున్నదని, తాము మంచి మిత్రులం అన్నట్టుగా స్పందించడం బట్టి చూస్తే, విజయకాంత్ దారి ఏ వైపు ఉంటుందోనన్న ఎదురు చూపులు మిగిలిన పార్టీల్లో నెలకొంది.