రాష్ర్టంలో అభివృద్ధి కుంటు
కాంగ్రెస్ పాలనలో కర్ణాటకలో అవినీతి పెరిగింది
కర్ణాటకలో ఒక కోటి సభ్యత్వ నమోదు లక్ష్యం
అమిత్ షా వెల్లడి
బెంగళూరు : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కర్ణాటకలో అవినీతి పెరిగిపోతోందని, అభివృద్ధిలోనూ రాష్ట్రం వెనకబడి పోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రంలో కోటి మందిని కొత్త సభ్యులుగా పార్టీలో చేర్చడాన్ని లక్ష్యంగా నిర్దేశంచినట్లు తెలిపారు. బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కర్ణాటకలో శాంతి, భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు తాను నగరానికి వచ్చాననడం సరికాదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఇక రాష్ట్రంలో కోటి మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్చడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మూడు విడతల్లో సభ్యత్వ ‘మహా అభియాన్’
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ... రాష్ట్రంలో మూడు విడతలో సభ్యత్వ నమోదుకు సంబంధించిన మహా అభియాన్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 10, 11తేదీల్లో మొదటి విడత మహా అభియాన్‌ను నిర్వహించనున్నామని, ఈ విడతలో 10లక్షలకు పైగా సభ్యత్వ నమోదును పూర్తి చేయనున్నామని తెలిపారు. ఇక రెండో విడత మహా అభియాన్ ఈ నెల 24, 25తేదీల్లో నిర్వహించనున్నామని, ఈ విడతలో 25లక్షల మేర సభ్యత్వ నమోదును పూర్తి చేయనున్నామని చెప్పారు. మూడో విడతకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మఠాలపై పెత్తనం చేసేందుకు గాను రూపొందించిన బిల్లు, గోహత్యా నిషేధ బిల్లును వెనక్కు తీసుకోవడం, చార్జీల తగ్గించేందుకు ముందుకు రాకపోవడంపై ప్రజల మధ్యన ప్రభుత్వాన్ని నిలదీసే దిశగా కోర్ కమిటీలో చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ అంశాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లే దిశగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్ రావు, కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానంద గౌడ, బీజేపీ సీనియర్‌నేతలు యడ్యూరప్ప, కె.ఎస్. ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.
సదస్యత్వ అభియాన రథం ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సదస్యత్వ అభియాన్ కోసం ఎల్‌ఈడీ తెరతో ఏర్పాటుచేసిన రథాన్ని అమిత్ షా ప్రారంభించారు. అనంతరం నగరంలోని గంగమ్మ తిమ్మయ్య సభాభవనంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్ షా లాంఛనంగా ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అమిత్ షా రాక సందర్భంగా బీజేపీ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం దారిలో వాహనాలను సైతం అనుమతించలేదు.
‘కాంగ్రెస్ ముక్త కర్ణాటక’ దిశగా బీజేపీ శ్రేణులకు దిశా నిర్దేశం....
ఇక బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంతో పాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో సైతం అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘కాంగ్రెస్ ముక్త కర్ణాటక’ను సాధించే దిశగా అందరూ పనిచేయాలని బీజేపీ శ్రేణులకు అమిత్ షా సూచించినట్లు సమాచారం. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీతో పాటు పార్టీకి చెందిన కార్యకర్తలందరూ తప్పక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక దక్షిణ భారత్‌లో బీజేపీ పాగా వేసేందుకు కర్ణాటకనే కేంద్రంగా మార్చుకోవాలని, ఆ దిశగా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని అమిత్ షా బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.