సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున ఎన్నికల నియమావళిని సడలించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమతితో రాసిన ఈ లేఖలో ఆయన, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటే అనేక ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. గత గురువారం రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.
మార్చి 5న అమలులోకి వచ్చిన నియమావళి, వచ్చే నెల 16న ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. అంటే... ఇంకా దాదాపు నెలకు పైగా ప్రజాప్రతినిధులు విధులకు హాజరయ్యే అవకాశం లేదు. వివిధ శాఖల్లో మంత్రుల సమీక్షలు, బదిలీలు లాంటి వ్యవహారాలు నియమావళి కింద నిషిద్ధం. అంతేకాకుండా మంత్రులు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించ కూడదు. దీని వల్ల అభివృద్ధి పనులు కుంటుపడతాయని కౌశిక్ ముఖర్జీ పేర్కొన్నారు.
ఎన్నికలు ముగిసి, ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినందున, మంత్రులు సహా ఎవరూ ఓటర్లను ప్రభావితం చేయజాలరని ముఖర్జీ వివరించారు. కనుక వెంటనే నియమావళిని ఎత్తివేసి ప్రభుత్వ పనులకు ఆటంకం కలుగకుండా చూడాలని ఆయన కోరారు. కాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖపై ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తున్నామని న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర సోమవారం విలేకరులకు తెలిపారు.
బీజేపీ డిమాండ్
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసినప్పటికీ, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అధికారుల దర్బారు సాగుతోందని బీజేపీ విమర్శించింది. అభివృద్ధి కార్యక్రమాలు కుంటు పడినందున ఎన్నికల కమిషన్ సత్వరమే నియమావళిని సడలించాలని డిమాండ్ చేసింది. పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులు జగదీశ్ శెట్టర్, సదానంద గౌడ మాట్లాడుతూ ఈ నెల 17న ఎన్నికలు ముగిశాయని, వచ్చే నెల 16 వరకు నియమావళి అమలులో ఉంటే అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు.
ప్రజాప్రతినిధులు ఏ పని చేయాలన్నా నియమావళి అడ్డు పడుతోందని విమర్శించారు. మంత్రులు అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసే అవకాశం లేదని, తద్వారా పాలన స్తంభించిపోయిందని తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాస్తామన్నారు.
మాజీ మంత్రి ఆర్. అశోక్ మాట్లాడుతూ ముళబాగిలులోని ఓ మసీదులో ఇమ్రాన్ అనే యువకున్ని దారుణంగా హత్య చేయడం తాలిబన్ సంస్కృతికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాలిబన్ సంస్కృతి కూడా ప్రవేశించిందని విమర్శించారు. ఈ హత్యను ఘర్షణగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో పోలీసుల హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు.
ఇంకా ‘కోడా’!
Published Tue, Apr 22 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM
Advertisement
Advertisement