సాక్షి, బెంగళూరు : రైతు సంక్షేమం పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా మోసం చేస్తోందని మా ముఖ్యమంత్రి, శాసన మండలి విపక్ష నాయకుడు సదానందగౌడ ఆరోపించారు. విధానసౌధలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మాట్లాడారు. వక్క వల్ల ఎటువంటి హాని లేదని అందువల్ల ఆ పంట నిషేధం ఆలోచనలేదని చెబుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో మాత్రం వక్కలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఎందుకు పేర్కొన్నారో రైతులకు చెప్పాలన్నారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన అధిక వర్షాల వల్ల రూ.625 కోట్ల విలువైన వ్యవసాయ పంటలు నీటిలో మునిగిపోయాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొందన్నారు. అయితే ప్రభుత్వం రూ.25 కోట్లు మాత్రం విడుదల చేసి రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నామని జబ్బలు చరుచుకుంటోందన్నారు. ఈ విధంగా ద్వంద్వ విధానాలతో రైతులను మభ్యపెడుతున్న సీఎం సిద్ధరామయ్యకు ఆ పదవిలో కూర్చొనే నైతికత లేదన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు రోషన్‌బేగ్, డీకే శివకుమార్‌లకు మంత్రిపదవులు ఎలా కేటాయిస్తారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. సిద్ధరామయ్య మాటపై నిలబడే మనిషి కాదన్నారు. ఇలాంటి వారు ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవిలో ఎలా కొనసాగుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దివాళా తీస్తోందన్నారు. అదే విధంగా రోడ్ల మరమ్మతుల విషయంలో, సీఈటీ సమస్య పరిష్కారంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సదానందగౌడ దుయ్యబట్టారు.
ప్రభుత్వం రైతులను మోసగిస్తోంది
Published Tue, Jan 7 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement
Advertisement