సాక్షి, ముంబై: స్కూల్ బస్సుల్లో పాఠశాలకు వచ్చే విద్యార్థుల భద్రత బాధ్యత ప్రిన్సిపాళ్లపైనే ఉంటుంది. ఈ మేరకు విద్యా శాఖ ఆదేశాలు జారీచేసింది. ఇటీవలికాలంలో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నగరంతో పాటు, శివారు ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా అనేకమంది గాయపడ్డారు.
ఈ ప్రమాదాలను తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ.... కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విద్యార్థులు పాఠశాలకు రావడం మొదలుకుని తిరిగి ఇంటికి చేరుకునే వరకూ వారి బాధ్యతలు ప్రిన్సిపాళ్లపైనే ఉంటుంది. అందుకు ప్రధానోపాధ్యాయులు ఒప్పందం కుదుర్చుకున్న స్కూల్ బస్సులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులను ఆటో లేదా ట్యాక్సీలలో పాఠశాలకు తీసుకురావడాన్ని విద్యా శాఖ పూర్తిగా నిషేధించింది. ఇక మీదట విద్యార్థులు కాలినడకన రావాలి లేదా ప్రత్యామ్నాయ మార్గంగా బెస్ట్ బస్సు, లోకల్ ైరె ళ్లను వినియోగించుకోవాలి. చాలా చోట్ల పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన స్కూల్ బస్సులనే విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. వికలాంగులు, అనారోగ్యం తదితర కారణాలతో సొంత కార్లు, ఇతర వాహనాల్లో వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి మెడికల్ సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.
విద్యాశాఖ జారీచేసిన ఆదేశాల్లో ముఖ్యాంశాలు
పాఠశాలలే సొంతంగా బస్సు సేవలు ప్రారంభించుకోవాలి. లేదా కాంట్రాక్టు పద్దతి ఏర్పాటు చేసుకోవాలి.
బస్ డ్రైవర్, సహయకులు ప్రత్యేకంగా యూనిఫారం, గుర్తింపు కార్డు జారీచేయాలి.
బస్ డ్రైవర్ల కోసం
సంవత్సరానికి రెండుసార్లు ప్రథమ చికిత్స బాక్స్‌ను, అగ్నిమాపక యంత్రాలను రీఫిలింగ్ చేసుకోవాలి. మంటలను ఆర్పే ఐదు కేజీల సిలిండర్‌ను అందుబాటులో ఉంచాలి.
దృష్టి దోషం లేదని ఎంబీబీఎస్ డాక్టర్లు జారీచేసిన ధ్రువీకరణ పత్రం పాఠశాల యాజమాన్యానికి అందజేయాలి.
సమయ పాలనను కచ్చితంగా పాటించాలి. బస్సులో ఎఫ్‌ఎం రేడియో లేదా టేప్ రికార్డర్ పెట్టరాదు. పొగతాగడం, మద్యపానం అలవాట్లు ఉండరాదు.
బస్సు సిబ్బంది పిల్లలకు ఎలాంటి తినుబండారాలు, పానీయాలు ఇవ్వరాదు.
బస్సు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నా లేదా ఏదైనా ప్రమాదానికి గురైన వెంటనే పాఠశాల యాజమాన్యానికి తెలియజేయాలి.
15 సంవత్సరాలకు దాటిన పాత బస్సులను విద్యార్థులను తరలించడానికి వాడరాదు. వేగాన్ని నియంత్రణ పరికరాలు తప్పకుండా బిగించాలి.
బాలికల బస్సులో మహిళా సహాయకురాలిని కచ్చితంగా నియమించాలి.
స్కూల్ బస్సుల నిర్వహణపై గతంలోనూ ఆర్టీఓ అనేక నియమ, నిబంధనలు విధించింది. అయితే నిబంధనలు ఆచరణలో అమలు చేయడం సాధ్యం కాదని బస్సుల యజమానులు ఆందోళనకు దిగారు. ఫలితంగా రవాణా శాఖ కొన్ని నియమాలను ఉపసంహరించుకుంది.
విద్యార్థుల భద్రత బాధ్యత ప్రిన్సిపాల్‌దే
Published Wed, Nov 20 2013 12:59 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
Advertisement
Advertisement